Super Star Krishna- Adiseshagiri Rao: కార్డియాక్ అరెస్ట్ కి గురైన రోజు కృష్ణ ఎలా ఉన్నారు? మరణానికి కారణం ఏమిటీ?.. తమ్ముడు చెప్పిన సంచలన నిజాలు!సూపర్ కృష్ణ మరణం తాలూకు వేదన నుండి పరిశ్రమ ఇంకా బయటకు రాలేదు. నవంబర్ 15 మంగళవారం ఉదయం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో కృష్ణ కన్నుమూశారు. మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణ అస్థికలు మహేష్ బాబు పవిత్ర కృష్ణానదిలో కలిపారు. నిన్న మహేష్, త్రివిక్రమ్ ఈ కార్యక్రమం కోసం విజయవాడ వచ్చారు. కృష్ణ దశదిన కర్మకు, సంస్మరణ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కృష్ణ తమ్ముడు ఆది శేషగిరిరావు కృష్ణ మరణానికి కారణాలు తెలిపారు. కృష్ణ ఆసుపత్రిలో చేరిన రోజు ఏం జరిగిందో తెలియజేశారు.

ఓ ఇంటర్వ్యూలో పాలొన్న ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. ఆ రోజు అన్నయ్య ఇంటికి నేను వెళ్ళాను. చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మా చిన్నప్పటి సంగతులు గుర్తు చేసుకుని నవ్వుకున్నాము. నేటి సినిమాలు, పరిస్థితుల గురించి కూడా మా మధ్య చర్చకు వచ్చింది. అన్నయ్య చాలా సంతోషంగా, హుషారుగా కనిపించారు. అక్కడే నన్ను లంచ్ చేసి వెళ్ళమన్నాడు. ఇంటికి వేరే గెస్ట్స్ వస్తున్నారు. వాళ్ళతో కలిసి చేస్తానని, వెళ్ళిపోయాను.
అన్నయ్య కేర్ టేకర్ అర్ధరాత్రి అన్నయ్య అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించాడు. ఆయన పల్స్ చెక్ చేస్తే… చాలా తక్కువగా ఉందని గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఆలస్యమైంది. ఎక్కువ సమయం తగు మోతాదులో ప్రధాన అవయవాలకు ఆక్సిజన్ అందలేదు. దీంతో మెదడు,కిడ్నీ దెబ్బతిన్నాయి. దాదాపు 30 గంటలు అన్నయ్యను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఆయన చెప్పుకొచ్చారు.

సరైన సమయంలో కృష్ణ పరిస్థితిని గమనించకపోవడమే మరణానికి కారణమైందని ఆది శేషగిరిరావు తెలిపారు. వైద్యులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. కృష్ణను ఆసుపత్రికి తీసుకొచ్చే సరికే విషమ స్థితిలో ఉన్నారని, ఆక్సిజన్ అందక బ్రెయిన్ తో పాటు ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఇక ఆది శేషగిరిరావు మొదటి నుండి అన్నయ్యకు తోడుగా ఉన్నారు. నిర్మాతగా మారి కృష్ణతో సినిమాలు నిర్మించారు. అన్నయ్యతో పాటు మంచి మిత్రుడిని కోల్పాయానని ఆదిశేషగిరిరావు కన్నీరు మున్నీరు అవుతున్నారు.