Allu Arjun
Allu Arjun : కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పుష్ప 2 పేరు మార్మోగిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు థియేట్రికల్ రన్ పూర్తయింది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‍ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍లో కూడా సత్తా చాటుతోంది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. సినిమా విడుదలకు ముందు ఏర్పడిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువగా ఆరంభం నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించింది.. లెక్కల మాస్టారు సుకుమార్ లెక్కలేసుకుని మరీ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
రూ.1871 కోట్ల లెక్కతో ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ మూవీ సక్సెస్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే అంటూ సక్సెస్ మీట్‍లో అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్ వల్లే ఈ మూవీ సాధ్యమైందంటూ డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న భారతీయ చిత్రాల్లో పుష్ప 2 రెండో స్థానంలో నిలిచింది. రూ.2,024 కోట్లతో అమీర్ ఖాన్ నటించిన దంగల్ తొలి స్థానంలో ఉంటే.. రూ.1,871 కోట్లతో పుష్ప 2 రెండో స్థానానికి వచ్చింది. ప్రభాస్ రాజమౌళి బాహుబలి 2 (రూ.1,810కోట్లు)ను కూడా దాటేసింది. దంగల్ చిత్రం చైనాలోనే ఎక్కువ శాతం వసూళ్లు దక్కించుకుంది. కాగా, ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 టాప్‍లో నిలిచింది.
ఈ సినిమా హడావుడి ముగిసిపోవడంతో అల్లు అర్జున్ నెక్ట్స్ చిత్రం ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్, అట్లీ ఇంకా పలువురి పేర్లు బయటికి వచ్చినా సినిమా ఫైనల్ మాత్రం కాలేదు. ఈ సందిద్గతకు తెర పడాలంటే మార్చి 30 వరకూ వెయిట్ చేయాల్సిందేనని తెలుస్తోంది. ఉగాదిని పర్వదినాన్ని పురస్కరించుకుని బన్నీ తదుపరి చిత్రాలపై ఓ క్లారిటీ ఇస్తాడని తెలుస్తోంది. రెండు సినిమాలను అదే రోజున లాంచ్ చేయాలని బన్నీ ప్లాన్ చేస్తున్నారట. అటుపై బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎవరు రెడీగా ఉంటే వారితో ముందుగా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేయడం అన్నది బన్నీతో సాధ్యం కాదు. ఇప్పటి వరకూ ఆయన ఆ విధానంలో ఎన్నడూ సినిమాలు చేయలేదు. ఈ నేపథ్యంలో బన్నీ తన పాత పద్ధతిలో ముందుగా సినిమా పూర్తిచేసిన తర్వాతే రెండవ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడని కొందరి అభిప్రాయం. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కి కూడా ఏడాదికి పైగా సమయం పడుతుందని సమాచారం.