నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సర్దుకుపోయే వ్యక్తి.. ముఖ్యంగా సౌకర్యాలు లేవు అంటూ అసహనం వ్యక్తం చేయడం లాంటివి తెలియని వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితుల పై తీవ్ర నిరాశ వ్యక్తం చేసాడంటే.. ఇక అక్కడి సిబ్బంది పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల గురించి రాజమౌళి ట్వీట్ చేసి అధికారులను అప్రమత్తం చేశారు.
రాజమౌళి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘అర్ధరాత్రి ఒంటిగంటకు నేను డిల్లీ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాను. అక్కడ సిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చారు, వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. అయితే ఆ పత్రాలు నింపడం కోసం అప్పటికే కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని రాస్తున్నారు. మరి కొంతమంది నేలపైనే కూర్చొని రాస్తున్నారు.
నాకు అక్కడ పరిస్థితి చూడడానికి అసలు బాలేదు. చిన్న టేబులైనా ఏర్పాటు చేసి ఉండాల్సింది. అక్కడ ఎలాగోలా పని ముగించుకుని తిరిగి వస్తోన్న నాకు ఎయిర్ పోర్ట్ ఎగ్జిట్ గేట్ వద్ద ఎన్నో వీధి కుక్కలు కనిపించాయి. ఇలాంటి పరిస్థితులు చూస్తే విదేశీయులకు మన దేశం పై ఎలాంటి భావన కలుగుతుందో ఆలోచించండి. దయచేసి ఇప్పటికైనా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు వీటి పై దృష్టి పెట్టి సరిచేయండి’ అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు.
మొత్తానికి రాజమౌళి ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇదే తొలిసారి. ఇక రాజమౌళి పోస్ట్ తో ఢిల్లీ అధికారులు అప్రమత్తం అయ్యారు. రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కోసం లొకేషన్స్ ను వెతకడానికి ఢిల్లీ మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూట్ పూర్తి కానుంది. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురంభీమ్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే.