Srinu Vaitla: తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు శ్రీను వైట్ల ఇంట్లో విషాదం నెలకొంది. అందరినీ తన సినిమాలతో నవ్విస్తూ.. ఉండే శ్రీనువైట్ల… తనకెంతో ఇష్టమైన వ్యక్తి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రీను వైట్ల తండ్రి ఆదివారం తెల్లవారుఝామున కన్నుమూసినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

83 ఏళ్ల వయసులో ఉన్న శ్రీను వైట్ల తండ్రి కృష్ణారావు.. తూర్పుగోదావరి జిల్లా కందులవాలెంలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వయసు మీదపడటంతో.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం రోజూ తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లేవారు శ్రీను. ఇటీవలే బాగానే కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్న సమయంలో.. ఇలాంటి విషాదంతో కుటుంబం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
ఆదివారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమంగా మారడంతో.. తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు శ్రీను వైట్లను పరామర్శించేందుకు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. మరికొంత మంది ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు శ్రీను వైట్ల అభిమానులు సోషల్మీడియా ద్వారా ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
దర్శకుడు శ్రీను వైట్లకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టం. గతంలో ఆయన చేసిన చాలా సినిమాల్లో ఫాదర్ సెంటిమెంటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. పలు ఇంటర్వ్యూల్లోనూ తన తండ్రి గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉన్నానని ఎప్పుడూ చెప్తుండేవారు.