Sreeleela: RX100 లాంటి బోల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన ‘మహా సముద్రం’ అనే చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఎంతో జాగ్రత్తగా ద్రుష్టి పెట్టి తీసిన ‘మంగళవారం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. RX100 తర్వాత కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న పాయల్ రాజ్ పుత్ కి కూడా ఈ చిత్రం బాగా కలిసొచ్చింది. నటిగా కూడా ఆమెలో కొత్త కోణాన్ని బయటకి తీసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు అజయ్ భూపతి. ఈ సీక్వెల్ లో కూడా పాయల్ రాజ్ పుత్ నటిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమెకు బదులుగా హీరోయిన్ శ్రీలీల ఇందులో నటిస్తుందని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
‘మంగళవారం’ క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్ దెయ్యాలుగా మారినట్టు చూపిస్తాడు డైరెక్టర్. పార్ట్ 2 దానికి కొనసాగింపుగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు శ్రీలీల సీన్ లోకి రావడంతో మొదటి భాగానికి, రెండవ భాగానికి అసలు సంబంధం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈమధ్య కాలం లో సీక్వెల్స్ నిర్మాతల పాలిట లంకె బిందె అని చెప్పొచ్చు. యావరేజ్ గా తీసినా కాసుల కనకవర్షం కురిపిస్తున్నాయి. ‘మంగళవారం’ సీక్వెల్ కూడా డైరెక్టర్ కొనసాగింపుగా తీస్తే కుంభస్థలం బద్దలు కొట్టినట్టే. పాయల్ రాజ్ పుత్ ని ఇందులో దెయ్యం గా చూపిస్తే కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా పూర్తిగా డిఫరెంట్ స్టోరీ అయితే కమర్షియల్ గా ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. శ్రీలీల అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే డ్యాన్స్ మాత్రమే. నటనలో ఆమె చాలా వీక్ అనే విషయం ఆమె సినిమాలను చూస్తే మనకి అర్థం అయిపోతుంది.
‘భగవంత్ కేసరి’ చిత్రంలో పర్వాలేదు అనే రేంజ్ లో నటించినప్పటికీ,ఈమె స్థానంలో వేరే హీరోయిన్ ఉంటే ఎమోషన్స్ ఇంకా బాగా పండేవి కదా అనే ఫీలింగ్ అందరికీ కలిగింది. అలాంటి హీరోయిన్ ని పెర్ఫార్మన్స్ కి ఫుల్ స్కోప్ ఉన్న ‘మంగళవారం’ లాంటి సబ్జెక్టు కి ఎంచుకోవడమంటే సాహసం అనే చెప్పాలి. శ్రీలీల కి కూడా ఇది తనని తాను నిరూపించుకోవడానికి మంచి అవకాశం అనొచ్చు. ఒకవేళ నిరూపించుకోలేకపోతే ఇక నటిగా ఆమె ఎప్పటికీ సక్సెస్ కాలేదు అని ఫిక్స్ అయిపోవచ్చు. 2023 వ సంవత్సరం లో ఏకంగా అరడజను సినిమాలు విడుదల చేసిన శ్రీలీల, 2024 వ సంవత్సరం లో కేవలం ‘గుంటూరు కారం’ తో సరిపెట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం చేస్తుంది.