Razakar: ఆడవాళ్లను చెరిచేవారు. బలవంతంగా శిస్తు వసూలు చేసేవారు. కేవలం ఒక మతం మాత్రమే ఉండాలని కఠిన నిబంధనలు విధించేవారు. హక్కులు, పోరాటాలు అని మాట్లాడితే అంతమొందించేవారు. నిజాం గురించి.. ఇలాంటి వాటినే కథలు కథలుగా చెప్పగా విన్నాం. పుస్తకాల్లో చదివాం. వాటన్నింటి సజీవ సాక్ష్యాలను తెలంగాణలో అక్కడక్కడా చూసాం. వాటన్నింటికీ దృశ్య రూపమే రజాకార్ చిత్రం. వాస్తవానికి నిజాం దురాఘతాన్ని, ఆ రోజుల్లో జరిగిన విధ్వంసకాండను మొత్తం తెరకెక్కించాలంటే ఒక సినిమా సరిపోదు. కొన్ని వందల సినిమాలు తీయాలి. అలాగని నిజాం కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక్కరి జీవితం చుట్టూ కథ అల్లుకుంటే, దానికి హంగులు అద్దితే అది పక్కా కమర్షియల్ సినిమా అయిపోతుంది. అలా కాకుండా చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలను తీసుకొని.. దేనికదే హైలెట్ చేస్తూ కథను నడిపించడం రజాకార్ సినిమాలో ప్రత్యేకత.
1947 ఆగస్టు 15న దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్రం రావడానికి మరో 13 నెలలు పట్టింది. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో పోలీస్ చర్య “ఆపరేషన్ పోలో” వల్ల తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించింది. ఈ 13 నెలల్లో ఏం జరిగింది? నిజాం ను తెలంగాణ ప్రాంతం నుంచి బయటికి పంపడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనేవే ఈ సినిమాలో కథలో ప్రధాన అంశాలు.
వాస్తవానికి ఈ సినిమాలో ఒక్కొక్క సన్నివేశం చూస్తుంటే గుండెలో భయం, పట్టరాని కోపం, తన్నుకు వచ్చే ఆవేశం ప్రేక్షకుల్లో కలుగుతాయి. ఈ విషయంలో దర్శకుడు అభినందనీయుడు. అటువంటి భావోద్వేగాలను రగిలించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. అవి అలా పండించేలా కథ రాసుకోవడం.. దానికి తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోవడం గొప్ప విషయం.
అనసూయ, ప్రేమ, ఇంద్రజ, బాబీ సింహా లాంటి నటినటులు.. ఒక్కో ఘటనలో.. ఒక్కో తీరుగా హైలైట్ అయ్యారు. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఖాసీం రిజ్వీ పాత్రలను థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు మర్చిపోలేరంటే.. ఆ పాత్రల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాను వందల మంది జూనియర్ ఆర్టిస్టులు, రకరకాల సెట్స్ తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విషయంలో దర్శకుడి ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిర్మాత పెట్టిన ఖర్చు ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. భీమ్స్ సంగీతం తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుంది. బుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ సాహిత్యం మరో స్థాయిలో ఉంది. ముఖ్యంగా అనసూయ మీద తెరకెక్కించిన ఒక గీతం ఈ సినిమాకే హైలెట్.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక పార్టీ తనకు అనుకూలంగా మాట్లాడితే.. మరొక పార్టీ వ్యతిరేకంగా మాట్లాడింది. వాస్తవానికి ఒక చరిత్రకు సంబంధించి భిన్నాభిప్రాయాలు కచ్చితంగా ఉంటాయి. దానిని సినిమాగా తెరకెక్కించే క్రమంలో అవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఒక వర్గానికి నచ్చొచ్చు. మరో వర్గానికి నచ్చకపోవచ్చు. కేవలం రెండున్నర గంటల సినిమా కాబట్టి..దాని నిడివి దృష్ట్యా కొంతమంది పోరాటయోధులకు, ఇంకా కొన్ని సంఘటనలకు స్థానం కల్పించకపోయి ఉండొచ్చు. ఒకటి మాత్రం నిజం పచ్చటి తెలంగాణలో నిజాం నెత్తుటి దురాఘతాలు జరిగాయి. పసిపిల్లల ఆక్రందనలు, పడుచు పిల్లల ఆవేదనలు, యువకుల కన్నీళ్లు, మధ్య వయస్కుల బాధలు.. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. కానీ వీటన్నిటిని ధైర్యంగా తీయగలడం గొప్ప విషయమైతే.. వాటిని మరింత గొప్పగా తెరకెక్కించడం ప్రశంసనీయం. అన్నిటికి మించి సినిమా చివరిలో తెలంగాణ పోరాట యోధులను గుర్తు చేసుకోవడం.. దానికి తగ్గట్టుగా ఒక పాటను రూపొందించడం అభినందనీయం.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Special article on razakar movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com