Solar Eclipse 2022: దీపావళి తరువాత రోజైన మంగళవారం సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. సూర్యగ్రహణం మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 4గంటల 15 నిమిషాలకు మొదలై.. 6 గంటల 15 నిమిషాలు ముగుస్తుంది. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయాలపై ఇప్పటికే చాలా మందికి అర్థమైంది. అయితే ఈ గ్రహణం ఏ రాశుల వారికి అనుకూలంగా.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందన్న విషయాలపై చాలా మంది అయోమయంగా ఉన్నారు. కొందరు పండితులు చెబుతున్న ప్రకారం 4 రాశుల వారికి అనుకూలంగా.. 5 రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందంటున్నారు.. తుల రాశివారు పొరపాటున కూడా గ్రహణాన్ని చూడొద్దని అంటున్నారు. ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం.

అక్టోబర్ 25న ఏర్పడే సూర్య గ్రహణం సంవత్సరంలో రెండోది. ఇప్పటికే ఏప్రిల్ 19న సూర్యగ్రహణం ఏర్పడింది. కానీ ఆ ప్రభావం ఇండియాపై లేదు. ఈసారి పాక్షికంగా మన దేశంలో సూర్యగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం సందర్భంగా సింహం, ధనుస్సు , మకర , వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయని పండితులు అంటున్నారు. గ్రహణం తరువాత రోజు నుంచి వృషభ రాశి వారికి పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి. అనేక ఆర్థిక లావాదేవీలు కలిసి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారని చెబుతున్నారు.
సింహరాశివారికి కూడా ఇప్పటి నుంచి మంచిరోజులే ఉండబోతున్నాయి. నూతన గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. అయితే ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వీరితో పాటు ధనుస్సు, మకర రాశివారికి కూడా అనుకూల ఫలితాలేనని పేర్కొంటున్నారు. వీరు అనుకున్న పనులు త్వరగా ముగిస్తారు. ఇప్పటి వరకు ఉన్న అనేక సమస్యల నుంచి బయటపడుతారని అంటున్నారు.

అయితే కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీనం రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. వీరిలో తుల రాశివారు పొరపాటున కూడా గ్రహణాన్ని వీక్షించవద్దని సూచిస్తున్నారు. గ్రహణం సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. స్వాతి నక్షత్ర జాతకులు, తులరాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అయితే గ్రహణం వీడిన తరువాత అవసరమైన పూజలు చేయడం వల్ల కొన్ని దోషాలు తొలిగిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
గ్రహణం సందర్భంగా ఇప్పటికే ప్రముఖ ఆలయాలను మూసివేశారు. సాయంత్రం గ్రహణం వీడిన తరువాత లేదా బుధవారం ఉదయం మళ్లీ ఆలయాలు తెరిచే అవకాశం ఉంది. ఇక కొందరు ఇళ్లల్లో గ్రహణం సమయానికి అన్ని పనులు ముగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఆహారం తినొద్దని కొందరి నమ్మకం. గ్రహణం తరువాత ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తరువాత ఆహారం వండుకునే పద్దతి ఆనవాయితీగా వస్తోంది.