Evaru Meelo Koteeswarudu: జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా.. బుల్లితెరపై ఎందరినో ఆకట్టుకున్న రియాలిటీ గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడు. ఇప్పటికే ఈ షోకు పలువురు సినీ తారలు వచ్చి.. తమదైన శైలిలో ఆటను ఆడి ప్రేక్షకులను అలరించారు. రామ్‌చరణ్, రాజమౌళితో పాటు, పలువురు హీరో, హీరోయిన్లు కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ షోలో సామాన్యులకు అవకాశాన్ని కల్పిస్తూ.. గేమ్ ఆడి కోటి రూపాయలకు గెలిచే ఛాన్స్‌ను కల్పించారు. అయితే, తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ఓ ఎస్సై బి. రాఘవేంద్ర ఈ షోలో పాల్గొన్నారు. ఈయన కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించినట్లు తెలుస్తోంది.

మొత్తం 15 ప్రశ్నలకు కరెక్టుగా సమాధానాలు చెప్పి.. కోటి రూపాయలు సొంతం చేసుకున్నట్లు సమాచారం. తాజాగా, వచ్చిన ప్రోమోలో ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న అడగ్గా.. రాఘవేంద్ర రావు సమాధానం చెప్పి లాక్ చేయడం చూపించారు. దాంతో సస్పెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది. అయితే, ఈ షో ఇంకా ప్రసారం కాలేదు.. కానీ, రాఘవేంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. నిర్వహకుల నుంచి మాత్రం ఈ విషయంపై ఎటువంటి స్పందన రాలేదు.
మరోవైపు, రామ్‌చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు తారక్. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. పిరియాడికల్ స్టోరీ నేపథ్యంలో కథ సాగనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.