Shyam Benegal: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ప్రాంతాల్లో జన్మించిన.. ఎన్నో కళాఖండాలకు దర్శకత్వం వహించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు.. వ్యదార్థ జీవితాలను యదార్ధ గాథలు గా మలిచి సినీ వైతాళికుడిగా పేరుపొందారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ పాల్కే పురస్కారాలతో సత్కరించింది. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే, కలకత్తా గ్వాలియర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్లు, బి.యన్.రెడ్డి జాతీయ పురస్కారం, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం వంటివి అందుకున్నారు. తన సినిమా ప్రస్తానాన్ని అంకూర్ తో మొదలుపెట్టిన శ్యామ్.. ఏడు దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. విలక్షణ సినిమాలు తీస్తూ ఆకట్టుకున్నారు. డాక్యుమెంటరీలు రూపొందించి ఔరా అనిపించారు.
కవితాత్మక కోణంలో..
వెండి తెరపై వాణిజ్య చిత్రాలు సందడి చేస్తున్న సమయంలో వాస్తవికతకు శ్యామ్ బెనగల్ పెద్దపెట్టవేశారు. అంకూర్ అనే సినిమా ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ కీర్తిని రెపరెపలాడించారు. భారతీయ సినిమాలలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. నిశాంత్, మంథన్, భూమిక.. 24 సినిమాలు తీసి ఔరా అనిపించారు. దాదాపు 16 సినిమాలు శ్యాం బెనెగల్ కు జాతీయ పురస్కారాలు తెచ్చిపెట్టాయంటే.. అతని ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ అల్వాల్ లో పుట్టిన ఆయన సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. శ్యాం బెనెగల్ తండ్రి కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. అయితే జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్లో మహబూబ్ కాలేజీ లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ చేశారు.. శ్యామ్ బెనగల్.. విఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్ కు శ్యాం బెనెగల్ దూరపు బంధువు అవుతారు.. 1959లో ముంబై నగరంలోని ఓ ప్రకటనల ఏజెన్సీలో కాపీ రైటర్ గా మొదలుపెట్టిన శ్యామ్.. క్రియేటివ్ హెడ్ గా ఎదిగారు. 1962లో ఘెర్ బేతా గంగా అనే డాక్యుమెంటరీని రూపొందించారు. మొత్తంగా 70 డాక్యుమెంటరీలను శ్యాం రూపొందించారు. కమర్షియల్ పేరుతో అడ్డగోలుగా సినిమాలు తీసి.. ప్రేక్షకులకు వినోదాన్ని దూరం చేస్తున్న దర్శకులు.. శ్యామ్ బెనగల్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక ఇతివృత్తాలతో ముడిపడి ఉన్న కథలతో సినిమాలను తీయాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే నేటి దర్శకులకు, ముఖ్యంగా తెలుగు దర్శకులకు శ్యాం బెనెగల్ జీవితం ఆదర్శనీయం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.