కరోనా లాక్ డౌన్ సమయంలో హీరోయిన్లు అందాన్ని పెంచుకోవడానికి వర్కౌట్స్ బాట పడితే.. హీరోయిన్ శృతిహాసన్ మాత్రం పెన్ తో ప్రయోగాలు చేసింది. ఈ కరోనా కాలంలో తానూ అద్భుతమైన స్టోరీ లైన్స్ రాశాను అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో గర్వంగా చెప్పుకుంది. శృతిహాసన్ అంటేనే మల్టీ టాలెంటెడ్. కాబట్టి, ఆమె కథలు రాసినా ఎవ్వరూ షాక్ అవ్వరు. శృతికి ఆ కెపాసిటీ ఉంది.
అయితే, తాజాగా తానూ రాసిన స్టోరీ లైన్స్ ను పూర్తి స్థాయి స్క్రిప్ట్ లుగా మార్చిందట. సినిమా స్క్రిప్ట్ రాయడానికి ఈ ముదురు భామ ఆన్ లైన్ లో స్క్రీన్ ప్లే కోర్సు కూడా చేసిందట. ఆ కోర్సులో నేర్చుకున మెళకువలతో మొత్తానికి శృతిహాసన్ స్క్రిప్ట్ రైటర్ అవతారం ఎత్తబోతుంది అన్నమాట. ఆ మాటకొస్తే శృతి హాసన్ కి 15 ఏళ్ల వయసు నుంచే కవితలు, పాటలు రాయడం అలవాటు అట.
స్కూల్ డేస్ లో మాస్టర్స్ పై కవితలు రాసేదట. అలాగే తన ఫ్రెండ్స్ కోసం కొన్ని లవ్ లెటర్స్ కూడా రాసిందట. మరి ఆ అనుభవాలతో శృతిహాసన్ ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ చేస్తోంది. ఇక తానూ రాసిన స్క్రిప్ట్ లలో ఒకటి తన తండ్రి కమల్ కోసమేనట. కమల్ కి కూడా స్క్రిప్ట్ వినిపించింది అని, ఆమె స్క్రిప్ట్ లో కమల్ కూడా హెల్ప్ చేస్తున్నాడని తెలుస్తోంది.
అంటే.. కథా రచయితగా తన తండ్రి సినిమాతోనే శృతి హాసన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే హీరో సూర్య కోసం కూడా ఒక కథ రాసింది. సూర్యతో శృతి హాసన్ కి ప్రత్యేక స్నేహం ఉంది. పైగా మంచి చనువు ఉంది. మరి ఆ సాన్నిహిత్యంతో శృతి హాసన్ సూర్యను ఒప్పిస్తోందేమో. ప్రస్తుతం వరుస సినిమాలతో హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది శృతిహాసన్.
పైగా ‘గోపీచంద్ మలినేని – బాలయ్య’ కాంబినేషన్ లో రానున్న సినిమా కూడా శృతి హాసన్ కే వెళ్ళింది. హీరోయిన్ గా ఇలా తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. స్క్రిప్ట్ రైటింగ్ ను మాత్రం మానేలా లేదు శృతి హాసన్. రచన ఆమెకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తోందట.