Ibomma Ravi: దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు ఐ బొమ్మ నిర్వాహకుడు రవి. చివరికి అత్యంత పకడ్బందీ సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమ దైన స్టైల్ లో విచారిస్తున్నారు. దీంతో అతడు సంచలన విషయాలను బయటపెడుతున్నాడు. దీంతో రవికి సంబంధించిన అసలు కోణం వెలుగులోకి వస్తోంది. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో దిగ్బ్రాంతి కలుగుతోంది.
ఐ బొమ్మ రవి వాస్తవానికి ఓ కంపెనీ సీఈవో. అతడు గతంలో ఈ ఆర్ ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ గా ఉండేవాడు. సీఈఓ గా ఉన్నప్పుడే అతనికి వివాహం జరిగింది. వైవాహిక బంధం కొద్దిరోజులు బాగానే ఉంది. ఆ తర్వాత అతడు భార్య నుంచి ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నాడు. సాఫ్ట్వేర్ రంగం లో విపరీతమైన నైపుణ్యం ఉండడంతో.. అతడు ఐటీఫీల్డ్ నుంచి బయటికి వచ్చాడు. సినిమా పైరసీరంగంలోకి ప్రవేశించాడు.
ఇతడికి ఐటీ రంగంలో విపరీతమైన పట్టు ఉంది. అందువల్లే సర్వర్లను అత్యంత సులభంగా హ్యాక్ చేయగలడు. అందువల్లే సినిమాలను పైరసీ చేయడం మొదలుపెట్టాడు. తన వెబ్సైటుకు అత్యంత సమర్థవంతమైన ఫైర్ వాల్స్ రూపొందించాడు. ఎవరూ హ్యాక్ చేయలేని విధంగా కొత్త కొత్త సినిమాలను అందులో పెట్టేవాడు. ఇది కాస్త నిర్మాతలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించేది.. ఐ బొమ్మ ను నియంత్రించాలని నిర్మాతలు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా అతడు పోలీసులు తనను పసిగట్టలేరనే ధీమాతో ఉండేవాడు. విదేశాలలో ఉంటూ ఐ బొమ్మ సైట్ నిర్వహించేవాడు. అయితే విదేశాల నుంచి కూకట్పల్లి ప్రాంతానికి వచ్చిన అతడు పోలీసులకు సులువుగా దొరికిపోయాడు.
ఐ బొమ్మ మాత్రమే కాకుండా బప్పం అనే వెబ్ సైట్ కూడా నిర్వహించేవాడు రవి. ఇందులో కూడా కొత్త కొత్త సినిమాలను అందుబాటులో ఉంచేవాడు. పైగా హై ఎండ్ క్వాలిటీతో సినిమాలను చూసే విధంగా ఏర్పాటు చేసేవాడు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కువగా ఐ బొమ్మ వెబ్సైట్ చూసేవారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రవి ఐ బొమ్మను తనకు కాసుల కురిపించే యంత్రంలాగా మార్చుకున్నాడు. ఈ సైట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేవాడు.. 1xBet అనే బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్ ను రవి ప్రమోట్ చేసేవాడు. సినిమాలను చూసే వారిని బెట్టింగ్ వైపు మళ్లించేవాడు. తద్వారా కోట్లకు కోట్లు డబ్బు సంపాదించాడు. బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి భారీగా అతడు ఫీజు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు అతడి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా మూడు కోట్ల నగదు వరకు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే ఇతడి వ్యవహారాలు మరిన్ని బయటపడతాయని పోలీసులు అంటున్నారు. ఇతడి వెనుక ఉన్న బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను లోతుగా పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, పోలీసులు ఇప్పటికే ఐ బొమ్మ, బెప్పం వెబ్సైట్లను నిలుపుదల చేసినట్టు తెలుస్తోంది.