
లాక్డౌన్ కారణంగా గత రెండు మూడు నెలలుగా విద్యుత్ శాఖ మీటర్ రీడింగ్ తీయలేదు. కొందరు పాత విద్యుత్ బిల్లుల ఆధారంగా కొందరు విద్యుత్ బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ కరెంట్ బిల్లులు అధికంగా వస్తుండటంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లాక్డౌన్ సడలించడంతో జూన్ నెల నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ బిల్లులు తీస్తున్నారు. గత మూడునెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీస్తుండటంతో విద్యుత్ బిల్లులు వేలల్లో వస్తున్నాయి. వీటిని చూసిన జనాలు లబోదిబోమంటున్నారు. ఉదాహరణకు లాక్డౌన్ ముందు సామాన్యుల విద్యుత్ బిల్లులు రూ.200లోపు వస్తే ఈసారి ఏకంగా వెయ్యి నుంచి రెండువేలకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక వినియోగదారులు తలలు పట్టుకున్నారు.
స్నేహ దంపతులకు షాకిచ్చిన విద్యుత్ బిల్లు..
విద్యుత్ శాఖ సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు సైతం షాక్ ఇస్తోంది. ప్రముఖ సినీ దంపతులు స్నేహ-ప్రసన్నలకు విద్యుత్ బోర్డు షాకిచ్చింది. వారు నివసిస్తున్న ఇంటికే ఏకంగా 70వేల రూపాయాల కరెంట్ బిల్లు రావడంతో వారు అవాక్కయ్యారు. దీనిపై వారు మాట్లాడుతూ నలుగురి ఉండే ఇంటికే ఏకంగా 70వేల విద్యుత్ బిల్లు రావడం ఏంటని ప్రశ్నించారు. ప్రతీ రెండు మాసాలకు వచ్చే బిల్లు కంటే ఈసారి ఎన్నో రెట్లు ఎక్కువగా వచ్చిందని తెలిపారు. తమకు 70వేల బిల్లు చెల్లించే ఆర్థిక స్థోమత ఉందని.. ఇదే సామాన్యులకు వస్తే పరిస్థితి ఏంటని వాళ్లు ఎలా బ్రతుకగలరని విద్యుత్ శాఖ తీరుపై మండిపడ్డారు.
దీనిపై విద్యుత్ బోర్డులో పనిచేసే ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా మూడునెలలకు కలిపి ఒకేసారి విద్యుత్ బిల్లు ఇవ్వడంతోనే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని తెలిపారు. మీటర్ రీడింగుల్లో తప్పులు దొర్లడం వల్లనే వేలల్లో విద్యుత్ బిల్లు వస్తుందన్నారు. వెంటనే ప్రసన్న ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు వెళ్లి మళ్లీ రీడింగ్ కొత్త బిల్లు ఇస్తారని తెలిపారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు తప్పిదానికి సామాన్యులు మరింత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డబ్బుల్లేక సామాన్యులు అవస్థలు పడుతుంటే పుండుమీద రొకటి పోటుగా విద్యుత్ శాఖ కరెంటు బిల్లులు నిర్వాకం ఉందని పేద, మధ్యతరగతి ప్రజలు మండిపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంటు బిల్లులు విషయంలో వినియోగదారులకు క్లారిటీ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.