
రాజమౌళి స్టాంప్ కు ఉన్న డిమాండ్ ఏంటో అందరికీ తెలిసిందే. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చే జక్కన్న కోసం సగటు సినీ ప్రేక్షకుడు కళ్లు పెద్దవి చేసుకొని ఎదురు చూస్తాడంటే అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. సాధారణంగానే.. ఎవరెస్టుపై ఉన్న బ్రాండ్ వాల్యూకు ఎన్టీఆర్, రామ్ చరణ్ తోడవడంతో ఆకాశాన్నంటింది. దీని వాల్యూ ఎంతన్నది కేవలం డిజిటల్, శాటిలైట్ రైట్సే చెబుతున్నాయి.
RRR షూటింగ్ చివరి దశకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రీ-రిలీజ్ బిజినెస్ ఆ మధ్యనే మొదలైంది. అయితే.. ఆ బిజినెస్ రేంజ్ ఎంతన్నది ఇప్పుడు బయటికి వచ్చింది. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఈ మూవీ రేంజ్ చూసి అందరూ అవాక్కవుతున్నారు.
ఈ పాన్ ఇండియా మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఆ మొత్తం ఎంతో తెలిస్తే గుడ్లు తేలేయడం తథ్యం. ఏకంగా రూ.325 కోట్లు వెచ్చించి ఈ హక్కులను దక్కించుకుందట జీ గ్రూప్. ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది వాస్తవం అయితే మాత్రం.. ఇండియన్ సినిమాలోనే ఇదో భారీ రికార్డుగా చెబుతున్నారు.
కేవలం.. డిజిటల్, శాటిలైట్ హక్కులకే ఇంత చెల్లిస్తే.. ఇక, థియేట్రికల్ హక్కులకు ఇంకెంత చెల్లిస్తారోననే లెక్కలు వేసుకుంటున్నారు అభిమానులు. దాదాపు అన్ని హక్కులూ కలుపుకొని ఈ సినిమా దాదాపు 900 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. బాహుబలి 500 కోట్ల బిజినెస్ మాత్రమే చేస్తే.. RRR దాదాపు రెట్టింపు కొల్లగొడుతోందని చెబుతున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దానయ్య దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా గోల తగ్గిపోయి ఈ సినిమా రిలీజ్ దగ్గరపడితే మొత్తం బిజినెస్ పై క్లారిటీ రానుంది.