India Vs West Indies 2023
India Vs West Indies 2023: టీమిండియా జట్టు గత కొన్నేళ్లుగా ఎడతెరిపి లేకుండా క్రికెట్ ఆడుతోంది. అంతర్జాతీయ క్రికెట్ తోపాటు తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ భారత క్రికెటర్లు బిజీగా గడిపారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం భారత జట్టు ఇంగ్లాండు పయనమై వెళ్ళింది. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లాల్సి ఉంది. అయితే, సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి లేకుండా ఆడుతుండడాన్ని గమనించిన బీసీసీఐ వారికి విశ్రాంతినివ్వాలని భావించింది. అందుకు అనుగుణంగా వెస్టిండీస్ టూర్ కు జూనియర్లతో కూడిన యంగ్ ప్లేయర్లను ఎంపిక చేసింది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై – ఆగస్టు మధ్యలో రెండు టెస్టులు, మూడు వన్డేలతోపాటు, ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అయితే, ఈ పర్యటన ఖరారైనప్పటికీ ఇంకా షెడ్యూల్ ఫైనల్ కాలేదు. అయితే ఈ సిరీస్ కు మాత్రం యంగ్ క్రికెటర్లతో కూడిన బృందాన్ని బీసీసీఐ పంపించనున్నట్లు చెబుతున్నారు.
హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ జట్టు..
ఈ ఏడాది తీరికలేని క్రికెట్ ఆడుతున్న టీమ్ ఇండియా.. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ పైనే ఫోకస్ పెట్టనుంది. డబ్ల్యూటీసి ఫైనల్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడనుంది. టి20లకు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టును బీసీసీఐ తీర్చిదిద్దుతోంది. 2024 టి20 ప్రపంచ కప్ లక్ష్యంగా ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్ ముగిసిన అనంతరమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి యువ ఆటగాళ్లే టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో ఐదు టి20 మ్యాచ్ లకు కూడా యువ ఆటగాళ్లనే ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం..
ఈ సిరీస్ నుంచి సీనియర్లకు విశ్రాంతినిచ్చి.. ఐపీఎల్ 2023 సీజన్ లో సత్తా చాటిన యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, జితేష్ శర్మలతోపాటు రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ టైటాన్స్ వెటరన్ పేసర్ మోహిత్ శర్మలకు అవకాశం ఇవ్వాలని బిసిసిఐ భావిస్తోంది. టి20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు. అతనికి డిప్యూటీగా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ గాయం నేపథ్యంలో అతను వన్డే టీమ్ లోకి వెళ్లే ఇషాన్ కిషన్ వైస్ కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. అయితే, జైస్వాల్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం ఉంది. రింకూ సింగ్ ఫినిషర్ గా సత్తా చాటనున్నాడు. వికెట్ కీపర్ గా సంజు సాంసన్ కు జితేష్ శర్మ నుంచి మంచి పోటీ ఎదురు కానుంది. రెండు ఫార్మాట్లకు వేర్వేరు టీములను సిద్ధం చేస్తున్న బీసీసీఐ ఏ మేరకు ఫలితాలను రాబడుతుందో చూడాల్సి ఉంది.