Tammareddy Bharadwaj : గత కొద్దిరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉంటారంటూ మీడియా లో ఎంత పెద్ద చర్చ నడిచిందో మనమంతా చూసాము. ఈ గొడవ ఎక్కడ నుండి మొదలైందంటే మహాసేన రాజేష్ నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ ఒక సంచలన వీడియో చేయడం దగ్గర నుండి మొదలైంది. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని కోరిక ని వెళ్ళబుచ్చడం, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే లు సైతం బహిరంగంగా నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ చేయడం తో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ నారా లోకేష్ ని ఉపముఖ్యమంత్రిగా చూడాలని కోరికని చెప్పుకోవడం లో తప్పు లేదు, కానీ మాకు కూడా ఒక కోరిక ఉంది, మా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయండి అంటూ డిమాండ్ చేసారు.
దీంతో సోషల్ మీడియా లో ఒక్కసారిగా ఇరువురి పార్టీల మధ్య పెద్ద ఎత్తున గొడవలు ఏర్పడ్డాయి. ఎక్కడ చూసిన కొట్లాటలు మొదలయ్యాయి. వివాదం ముదరడం, అది నేరుగా ఇరువురి పార్టీల అధినేతల వరకు చేరడం తో, ఈ అంశం పై చర్చలు ఇక్కడితో ఆపేయాలని ఆదేశించారు. దీంతో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కాసేపటి క్రితమే ఒక వీడియో ని అప్లోడ్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘రాత్రి నాకు ఒక కల వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకొని, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేసి, ఆయన ఎన్డీయే కూటమి కి చైర్మన్ బాధ్యతలు చేపట్టినట్టు కలలో వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్, నారాలోకేష్ యువకులు. వాళ్లిద్దరూ ఈ రాష్ట్రాన్ని సమర్థవతంగా నడిపించగలరు. కాబట్టి వాళ్లిద్దరూ నిజంగానే ఆ బాధ్యతలు చేపడితే రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి. చంద్రబాబు ఎలాగో ముసలివాడయ్యాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడిన తీరుని చూస్తుంటే వ్యగ్యంగానే మాట్లాడినట్టు ఉంది. అనేక సందర్భాల్లో తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్, చంద్రబాబు లపై సెటైర్లు వేస్తూ వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నారా లోకేష్ రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి పదవి పై స్పందిస్తూ, నాకు ఏ పదవి అవసరం లేదు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తగానే కొనసాగుతాను అంటూ వివరణ ఇచ్చాడు.