Sekhar Kammula: క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.. ఆయనలో సామాజిక సేవ ఎక్కువ. నిజానికి శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిజమ్ పెద్దగా ఉండదు, కానీ ఆయనలో హీరోయిజమ్ ఉంది. రీల్ జీవితంలో చాలా మంది హీరోలు ఉంటారు. కానీ రియల్ గా హీరోలు అనిపించుకునే వాళ్ళ నిజ జీవితాల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఏది ఏమైనా పది మందికి సాయం చేసేవాడు ఎప్పుడు హీరోనే. కాగా తాజాగా ఈ సెన్సిబుల్ డైరెక్టర్ తానూ హీరో అని నిరూపించుకున్నాడు.

తనది పెద్ద మనసు అని శేఖర్ కమ్ముల ఘనంగా చాటుకున్నారు. రీసెంట్ గా ఓ ఛానెల్‌లో ఓ కథనం ప్రసారం అయింది. ఆ కథనంలో సారాంశం ఏమిటంటే.. అగ్ని ప్రమాదంలో ఓ రైతు తన ఇల్లు కోల్పోయాడు. అయితే ఆ రైతు బాధను చూసి.. శేఖర్ కమ్ముల స్పందించి అతనికి ఆర్థిక సాయం చేశాడు. ఇంతకీ ఎవరు ఆ రైతు అంటే.. తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా మునగాల మండంలోని నేల మర్రి గ్రామానికి చెందిన వ్యక్తి.
ఆ రైతు పేరు లక్ష్మయ్య. గత కొంతకాలంగా లక్ష్మయ్య ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఉన్న వ్యవసాయ భూమిని కూడా అమ్ముకున్నాడు. భూమికి వచ్చిన పది లక్షల్లో నుంచి అప్పులు సప్పులు తీర్చేశాడు. ఇక ఆరు లక్షలు మిగిలింది. ఆ డబ్బుతో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ డబ్బును తానూ ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోని బీరువాలో భద్రంగా దాచి పెట్టుకున్నాడు.
అయితే, ఇక్కడే దురదృష్టం అతన్ని వెంటాడింది. అనుకోకుండా ఆ ఇంట్లో గ్యాస్ లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అసలుకే పూరిల్లు.. దాంతో గ్యాస్ పేలుడు దెబ్బకు ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బును తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. ఆ మంటల్లో డబ్బు మొత్తం కాలిపోయింది. దాంతో లక్ష్మయ్య జీవచ్ఛంలా అయిపోయాడు.
లక్ష్మయ్య స్థితిని ఓ ఛానెల్ ద్వారా చూసిన శేఖర్ కమ్ముల అతని పై సానుభూతిని చూపించాడు. వెంటనే లక్ష్మయ్యకు తన వంతుగా ఆర్థిక సాయం చేస్తూ లక్ష రూపాయల మొత్తాన్ని లక్ష్మయ్య బ్యాంకు ఖాతాకు నేరుగా ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇది తెలిసిన నెటిజన్స్ శేఖర్ కమ్ముల మనసు చాలా మంచిదని ఆయన పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కోవిడ్ సమయంలో కూడా శేఖర్ కమ్ముల పారిశుద్ధ్య కార్మికులకు ఆహారాన్ని అందించిన సంగతి తెలిసిందే.