
వేరొక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మాతృభాషలోకి రీమేక్ చేయటమనేది ఎప్పటినుండో చిత్ర పరిశ్రమలో జరుగుతుంది. కొత్త కథలు తయారు చేయలేకనో లేక మంచి కథని తమ వారికి అందించాలనే కోరికనో లేక సక్సెస్ అయిన స్టోరీతో రిస్క్ లేకుండా హిట్ కొట్టొచ్చు అనే ఐడియానో ఏమో కానీ ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. అనేక తెలుగు చిత్రాలు వివిధ భాషలలోకి రీమేక్ అవుతూ తెలుగు ఇండస్ట్రీ ప్రతిభ దేశమంతటా మారుమ్రోగుతుంది.
యువ నటుడు నవీన్ పోలిశెట్టి 2019 లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అతడి అద్భతమైన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యేలా ఉండటంతో నిర్మాతల కళ్ళు ఈ మూవీ మీద పడ్డాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం ప్రధాన పాత్రలో ఈ మూవీ రీమేక్ ప్లాన్ చేస్తున్నారు. ‘వంజగర్ ఉళగం’ ఫేమ్ మనోజ్ బీధా ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు వహిస్తున్నారట. పేపర్ బాయ్, మజ్ను వంటి చిత్రాలలో మెరిసిన ‘రియా సుమన్’ సంతానం పక్కన హీరోయిన్ గా అవకాశం అందుకుంది.
ఇప్పటికే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ రీమేక్‌లో నవీన్ పోలిశెట్టినే హీరోగా తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట, “చిచోర్” లాంటి బాలీవుడ్ హిట్ మూవీలో నటించటంతో హిందీ ప్రేక్షకులకి ఈ యువ నటుడు సుపరిచితం. తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు సీక్వెల్ రాబోతుంది. మొదటి భాగాన్ని డైరెక్ట్ చేసిన స్వరూప్ ఆర్ ఎస్ జే దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా త్వరలో సెకండ్ పార్ట్ షూటింగ్ కి సిద్దమవుతుంది. ఒక సిరీస్ లాగ ఈ ప్రాజెక్ట్ కొనసాగించాలని హీరో,దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారని సమాచారం.