Santhana Prapthirasthu Movie Review: నటీనటులు: విక్రాంత్, చాందిని చౌదరి, మురళిధర్ గౌడ్, అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ తదితరులు.
సంగీతం: సునీల్ కాశ్యప్
ఛాయాగ్రహణం: మహి రెడ్డి
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి, సంజీవ్ రెడ్డి
భారీ బడ్జెట్లు, పెద్దపెద్ద స్టార్లు లేని సినిమాలన్నీ చిన్న సినిమాలే. ఇలాంటి సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడం ఈమధ్య పూర్తిగా తగ్గించేశారు ప్రేక్షకదేవుళ్ళు. రెండుమూడు నెలలకు ఏదో ఒక సినిమా హిట్ అవుతుంది. అలాంటి హిట్లకు తప్ప మిగతా చిన్న సినిమాలకు టికెట్లు తెగడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ట్రైలర్ తో కొంతమేరకు ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఈ సంతాన ప్రాప్తిరస్తు. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ బోల్డ్ ఫ్యామిలీ ఫిల్మ్ నవ్వులు పూయించిందా లేదా ప్రతి శుక్రవారం అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సినిమాగా మిగిలిందా అనేది రివ్యూలో చూద్దాం.
చైతన్య(విక్రాంత్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అభినవ్ గోమఠం లాంటి చిన్ననాటి స్నేహితులతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ సాఫీగా జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఒకరోజు తన ఫ్రెండ్ ను ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చెయ్యడానికి వెళ్ళినప్పుడు కళ్యాణి(చాందిని చౌదరి)ని చూస్తాడు. మొదటి చూపులోనే హీరోగారు మనసు పారేసుకుంటాడు. నెమ్మదిగా ప్రేమలో పడేస్తాడు. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. కళ్యాణి తండ్రి(మురళిధర్ గౌడ్) కు హీరో నచ్చడు. దీంతో వారిద్దరి పెళ్లిని వ్యతిరేకిస్తాడు. ఇలాంటి సందర్భాలలో ప్రతిసారి జరిగినట్టే హీరో హీరోయిన్లు జాక్(తరుణ్ భాస్కర్), ఇతర ఫ్రెండ్స్ సాయంతో పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు. కాపురం సవ్యంగా సాగుతోందని ఊపిరి పీల్చుకునేంతలో హీరోగారికి రెండు సమస్యలు ఎదురవుతాయి. అందులో ఒకటి.. మురళిధర్ గౌడ్ ఎంట్రీ ఇచ్చి కుట్రలతో తన కూతురిని అల్లుడిని విడదీసి తన కూతురికి ఇంకో పెళ్లి చేయాలని చూడడం. ఈ మిషన్ కోసం తన కూతురి ఇంట్లో కొన్ని రోజులు ఉండడం. హీరోగారికి ఏర్పడిన రెండో సమస్య ఏంటంటే స్పెర్మ్ కౌంట్ అత్యంత అల్ప స్థాయిలో ఉన్నందువల్ల పిల్లలు పుట్టరని, ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడం. ఈ రెండు సమస్యలను హీరో ఎలా అధిగమించాడు? తన మామగారిని ఎలా ఒప్పించాడు. సంతాన ప్రాప్తి కలిగిందా లేదా అనేది.. బాకీ కహానీ హై.
థీమ్ వరకూ చూసుకుంటే థిన్ గా ఉన్నా బాగానే ఉంది. పిల్లలు పుట్టరు.. ఎలా ఈ సమస్యను అధిగమించాలి? దీనికి తోడు మామగారి కుతంత్రాలను ఛేదించడం కూడా మరో టాస్క్. ప్లస్ GSTలాగా తరుణ్ భాస్కర్, అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్ తదితరుల కామెడీ అదనం. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు ఇలాంటి సినిమాలకు ఉండాల్సిన ఎమోషనల్ కనెక్ట్ మాత్రం పూర్తిగా మిస్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం హీరో విక్రాంత్ వీక్ నటన. దర్శకుడు సంజీవ్ రెడ్డి అసలు కథను విజువల్ గా ప్రెజెంట్ చేయడం మానేసి వందల కొద్దీ డైలాగులతో, ప్రాసలతో ‘మింగుడు’ భాషతో కథను నడిపించాలని అనుకోవడం. మామగారు తన కూతురి కాపురాన్ని విడగొట్టి ఇంకో పెళ్లి చేయాలని ప్రయత్నించే ట్రాక్ ఏదైతే ఉందో అదంతా టీవీలో సీరియల్ చూసిన ఫీల్ ఇస్తూ ఉంటుంది. హీరోగారు, తన చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అందరూ కన్వీనీయంట్ ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉండడం, హీరో గారి బాసు కూడా అసలు కథ సాగడానికే నేను ఆఫీసు పెట్టాను అన్నట్టుగా ప్రోత్సాహం ఇస్తూ ఉండడం అసహజంగా ఉంది. అసలు IT గురించి కనీస అవగాహన ఉన్నవారు ఎవరూ అలాంటి సీన్స్ రాయరు. ఇక వెన్నెల కిషోర్ ‘భ్రమరం’ పాత్ర కొంతవరకూ బాగానే ఉన్నా సినిమా నీరసంగా సాగుతూ ఉండడంతో నవ్వాలంటే మనకు ఉండాల్సిన కూసింత ఎనర్జీ కూడా ఆవిరైపోయి ఉంటుంది.
డైలాగ్ బేస్డ్ కామెడీ సృష్టించాలని అనుకోవడం తప్పుకాదు కానీ దానికి తగ్గ కథ, సీన్స్, ఆర్టిస్టుల నటన అన్నీ చక్కగా అమరాలి. ఆ సింక్ పూర్తిగా మిస్ అయింది. అక్కడక్కడా కొన్ని డైలాగులకి నవ్వు వస్తుంది. ఉదాహరణకు “చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ ని చిన్నప్పుడే వదిలించుకోవాలి” లాంటివి. అలా అని నిముషానికి 72 డైలాగులు డైలాగులు మింగుతూ ఉంటే లంకంత థియేటర్లో టిక్కెట్టు కొనుక్కుని మరీ బిక్కుబిక్కు మంటూ కూర్చున్న ముగ్గురు నలుగురు అర్భకుల పరిస్థితి ఏం కావాలి? రైటింగ్ డిపార్ట్మెంట్, దర్శకత్వం రెండు విభాగాలు రొట్ట సీన్స్ తో, అవుట్ డేటెడ్ నేరేషన్ తో సన్నటి దారం లాంటి కథను దుంప తెంచడంలో సంపూర్ణ విజయం సాధించారు. పాటలు కూడా సహనానికి పరీక్షే. మ్యూజిక్ కూడా సినిమాకు మైనస్సే అయింది. మహిరెడ్డి సినిమాటొగ్రఫీ మాత్రం బాగుంది.
మురళిధర్ గౌడ్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్, చాందిని చౌదరి లాంటి టాలెంటెడ్ నటులు ఈ సినిమాలో చాలామందే ఉన్నారు. అందరి నటన బాగానే ఉంది. అయితే సినిమాలో ఎమోషన్ మిస్ అవ్వడం వల్ల ఎక్కడ ప్రేక్షకులు వారితో ట్రావెల్ కాలేరు. హీరో విక్రాంత్ ఈ పాత్రకు అవసరమైన నటన మాత్రం కనబరచలేకపోయాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో నటుడిగా ఉన్నప్పటికీ తన ఈజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. దర్శకత్వం
2.హీరో నటన
3.పేజీల కొద్దీ ప్రాస డైలాగులు
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. సినిమా థీమ్
2. సినిమాటోగ్రఫీ
2. అక్కడక్కడా నవ్వించిన సీన్లు
ఫైనల్ వర్డ్: ప్రేక్షకులకు సుఖనిద్ర ప్రాప్తిరస్తు
రేటింగ్: 1. 5 /5