Sankranthiki Vastunnam: విక్టరీ వెంకటేష్ నేటి తరం సూపర్ స్టార్స్ కి కూడా సాధ్యం అవ్వని రికార్డ్స్ ని నెలకొల్పుతూ తన సత్తా ఏంటో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసాడు. గడిచిన రెండు దశాబ్దాలలో సోలో హీరోగా వెంకటేష్ కి సరైన సూపర్ హిట్ సినిమా లేదు. దీంతో నేటి తరం ఆడియన్స్ కి ఒకప్పుడు వెంకటేష్ సినిమాలు ఇలా ఆడేవి, ఫ్యామిలీ ఆడియన్స్ జాతర లాగా థియేటర్స్ కి కదిలేవారు, నెలల తరబడి థియేట్రికల్ రన్ ఉండేది వంటివి వినేవారు. వీళ్ళు చాలా ఎక్కువ చేసి చెప్తున్నారు, వెంకటేష్ కి అంత సీన్ లేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లందరికీ ఆయన సత్తా ఏ రేంజ్ అనేది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో నిరూపితమైంది. మొదటి రోజు డబుల్ డిజిట్ షేర్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ చిత్రం, రెండవ రోజు కూడా అదే జోరుని చూపించింది.
అలా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోయిన ఈ చిత్రం మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి మరో సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు తప్ప ఈ స్థాయి వసూళ్లు సీనియర్ హీరోలకు చూడలేదు. చిరంజీవి కి వచ్చాయి కానీ ఒక నాలుగు రోజుల సమయం పట్టింది. కానీ వెంకటేష్ కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోయాడు. ఇప్పుడు ఆయన ఆరు రోజుల్లో 200 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరి, మరో అరుదైన రికార్డుని నెలకొల్పాడు. చిరంజీవి కూడా 200 కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరాడు కానీ, అందుకు చాలా సమయం పట్టింది. కాని వెంకటేష్ వారం లోపే ఆ మార్కుని అందుకోవడం అందరినీ విసమయానికి గురి చేసిన విషయం. కేవలం నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
కుంభస్థలం బద్దలు కొట్టడం అంటే ఇదే కదా. వెంకటేష్ గత ఏడాది కూడా సంక్రాంతికి మన ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమాకి కేవలం 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దీనిని చూసి ఆయన అభిమానులు ఇక మన హీరో సోలో గా హిట్ కొట్టడం అసాధ్యమే అని అనుకున్నారు. కానీ ఏడాది తిరిగే లోపే సోలో హీరోగా కుర్ర హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు ని నెలకొల్పడాన్ని చూసి వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్స్ ఆఫీస్ ఊపుని చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తే మాత్రం ఈ తరం స్టార్ హీరోలకు అవమానమే అని చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.