Sankranthi Movie TRP Rating: కొన్ని సినిమాలు థియేటర్లకంటే టీవీలలోనే ఎక్కువ ఆడుతుంటాయి. ఈ ప్రస్తావన వస్తే చాలామందికి అతడు సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమా మాటీవీలో ఇప్పటికే కొన్ని వేలసార్లు ప్రసారమైంది. ఇంకా ప్రసారమవుతూనే ఉంటుంది. ప్రసారమైన ప్రతి సారి ఏదో ఒక రికార్డును ఆ సినిమా సృష్టించి వెళ్తోంది. ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైందో.. ఇప్పటికీ ఆ సినిమా మేకర్స్ కు అర్థం కావడం లేదు. ఇటీవల ఆ సినిమాను మరింత ఆధునీకరించి విడుదల చేశారు. వసూళ్ళు కూడా భారీగానే వచ్చాయి అంటున్నారు.
అతడు గురించి.. అది మాటీవీలో ప్రసారమవుతున్న తీరు గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. బహుశా మా టీవీ కి ఉన్న రీచ్ వల్ల కావచ్చు. అయితే అతడు రేంజ్ లోనే ఓ సినిమా కూడా టీవీలలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కాకపోతే ఈ విషయం అంతగా ప్రచారానికి నోచుకోవడం లేదు. అతడు విడుదలైన 2005 సంవత్సరంలోనే విక్టరీ వెంకటేష్ హీరోగా.. సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో సంక్రాంతి అనే సినిమా వచ్చింది. శ్రీకాంత్, సంగీత, స్నేహ, శివ బాలాజీ, శర్వానంద్ ఇందులో నటించారు. ఈ సినిమా అప్పట్లోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది. తమిళ్ రీమేక్ అయినప్పటికీ.. తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. సమ్మర్లో విడుదలై విక్టరీ వెంకటేష్ కెరియర్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా రైట్స్ ను అప్పట్లో జెమిని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసినప్పుడు ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందని సన్ మేనేజ్మెంట్ ఊహించి ఉండదు. ఈ సినిమా విడుదల 20 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ.. ఇప్పటికీ టెలికాస్ట్ చేసిన ప్రతి సందర్భంలోనూ సరికొత్త టిఆర్పి రేటింగ్స్ నమోదు చేస్తోంది.
తాజా ఆదివారంలో సంక్రాంతి సినిమాను జెమినీలో టెలికాస్ట్ చేయగా అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాస్ కలిపి 6.08 రేటింగ్స్ నమోదు అయ్యాయి. అర్బన్ ఏరియాలో 5.23 రేటింగ్స్ ను ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. స్టార్ మా లో జాక్ సినిమాను వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేస్తే అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 4.45 రేటింగ్ మాత్రమే వచ్చింది. అర్బన్ ఏరియాలో 5.80 రేటింగ్ నమోదయింది. జీ తెలుగులో నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ ను టెలికాస్ట్ చేస్తే అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 5.2 రేటింగ్ నమోదయింది. అదే అర్బన్ ఏరియాలో 5.32 రేటింగ్ దక్కింది. అసలే కొడి కట్టిన దీపం లాగా ఉన్న జెమినీ టీవీకి ఈ రేటింగ్స్ కాస్త సాంత్వన. స్మార్ట్ కాలంలో.. అది కూడా ఓటీటీలు దుమ్ము లేపుతున్న ఈ రోజుల్లో సంక్రాంతి లాంటి సినిమాలు ఈ స్థాయిలో రేటింగ్స్ సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే.