PC Ghose commission report: ఊహించినట్టుగానే తెలంగాణ రాజకీయాలలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంపై రేవంత్ ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. కొత్తకాలంగా కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి జరిగిన అవకతవకల విషయంలో విచారణను కేంద్ర దర్యాప్తు బృందానికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో ప్రత్యేక దర్యాప్తు బృందం చేతికి ఈ కేసును ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కాకుండా కేంద్ర దర్యాప్తు బృందానికి ఈ వ్యవహారాన్ని అప్పగించాలని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కాలేశ్వరం వ్యవహారం మొత్తాన్ని రేవంత్ నరేంద్ర మోడీ చేతిలో పెట్టారు. కొంతకాలంగా బిజెపి, బిఆర్ఎస్ కలిసి పోతాయని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని గులాబీ అధినేత కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఆ విషయాన్ని తాను వ్యతిరేకించినట్టు పేర్కొన్నారు. ఈ మధ్యన గులాబీ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ రైతులకు ఎవరైతే కావలసినంత యూరియా సరఫరా చేస్తారో.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వారికే తమ జై కొడుతామని స్పష్టం చేశారు. యూరియా సరఫరా కేంద్రం చేతిలో ఉంటుంది. పైగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి. అలాంటప్పుడు గులాబీ పార్టీ ఎన్డీఏకే ఓటు వేస్తుందని కేటీఆర్ చెప్పకనే చెప్పారు. ఈ పరిణామాలను పరిశీలించుకుంటూ వస్తున్న రేవంత్.. కారు, కమలం దోస్తీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించారు. అందువల్లే కాలేశ్వరం వ్యవహారం మొత్తాన్ని నరేంద్ర మోడీ చేతిలో పెట్టారు.
ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖను పర్యవేక్షించిన ఈటల రాజేందర్ ఘోష్ కమిషన్ నివేదికపై స్పందించారు. రేవంత్ ప్రభుత్వం కాలేశ్వరం వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి తప్పు చేసిందని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ వల్ల కెసిఆర్ కు ఏమీ కాదని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించి తప్పు చేసిందని రాజేందర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రభుత్వ చేతకానితనం ఈ వ్యవహారంలో బయటపడిందని మండిపడ్డారు. ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడక అని.. రాజేందర్ పేర్కొన్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కీలకమైన విషయాలను రేవంత్ సర్కార్ విస్మరించిందని.. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పట్టించుకోలేదని.. దీనివల్ల కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని రాజేందర్ మండిపడ్డారు.