Samyukta Menon : వాతావరణం ప్రశాంతంగా ఉంది. మరోవైపేమో ఓ గుర్రం పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది. దానిపైన దర్జాగా కూర్చున్న ఓ హీరోయిన్.. నెత్తికి హెల్మెట్.. చేతిలో గుర్రాన్ని అదుపు చేయడానికి వాడే తాడు ఉన్నాయి. ఇక ఆ గుర్రం కదలడమే ఆలస్యం ఆ హీరోయిన్ ఒక ప్రొఫెషనల్ రైడర్ లాగా సవారీ చేయడం మొదలు పెట్టింది. ఇదంతా ఆమె తదుపరి చిత్రం కోసం.. అలా గుర్రపు సవారీని ఆమె చాలా సేపు చేసింది. పరిగెత్తి పరిగెత్తి గుర్రం అలిసిపోయింది. దాన్ని అదుపు చేసి ఆమె కూడా చెమటలు కక్కింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?
సంయుక్త మీనన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. 2016లో “పాప్ కార్న్” అనే మలయాళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా పరిచయమైంది. విరూపాక్ష, బింబిసార, డెవిల్, సార్ వంటి చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించింది. త్వరలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే సినిమాలో నటించనుంది. పిరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించనుంది. ఈ సినిమాకు సంబంధించి కథానాయిక పాత్ర యుద్దాలలో పాల్గొంటుంది.. అందుకే గుర్రంసవారీ నేర్చుకుంటున్నానని సంయుక్త మీనన్ చెబుతోంది.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభు సినిమా రూపొందుతోంది. భువన్, శ్రీకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హీరో నిఖిల్ కు ఇది 20వ సినిమా. ఈ సినిమాలో నిఖిల్ ఓ పోరాట యోధుడి లాగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. ఇక ఈ చిత్రం కోసం నిఖిల్ జుట్టును భారీగా పెంచాడు. యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు. కథలో భాగంగా సంయుక్తా మీనన్ కూడా నిఖిల్ తో కలిసి యుద్ధాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకోసమే ఆమె గుర్రపు స్వారీ నేర్చుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాకి కెమెరామెన్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. మాటలు వాసుదేవ్ మునెప్ప సమకూరుస్తున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు.