
ఇటీవల విడుదలైన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మేన్2 ఎంత సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుందో అందరికీ తెలిసిందే. అయితే.. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద గొడవే జరిగింది. ఈ చిత్రంలో తమిళులను కించపరిచే సన్నివేశాలున్నాయని, ఈ సినిమాను బ్యాన్ చేయాలని ఓ వర్గం డిమాండ్ కూడా చేసింది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ డిమాండ్ మరింతగా పెరిగింది.
అయితే.. ట్రైలర్ చూసి ఓ నిర్ణయానికి రావొద్దని మేకర్స్ కోరుతూ వచ్చారు. ఇలా వివాదాల నడుమ విడుదలైందీ చిత్రం. అయితే.. సందేహించినట్టుగా ఎలాంటి వివాదాస్పద అంశాలు లేకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. ఎల్టీటీఈ ఛాయలు కనిపించే తమిళుల పోరాటాన్ని ప్రతిబింబించింది. దీంతో ఈ చిత్రం.. అన్నివర్గాలనూ ఆకట్టుకుంది. ఎక్కడా పట్టు సడలకుండా రాజ్ అండ్ డీకే ద్వయం తెరకెక్కించిన తీరు అబ్బుర పరిచింది.
కాగా.. ఈ సినిమాలోని నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషన్ పై పెద్ద చర్చే నడుస్తోంది. ప్రధాన పాత్రధారిగా ఉన్న మనోజ్ బాజ్ పేయికి రూ.10 కోట్లు ఇచ్చారని, సమంతకు రూ.5 కోట్లు ఇచ్చారనే వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. అయితే.. ఇదంతా నిజం కాదని, అసలు లెక్క ఇదేనని ఓ పత్రిక కథనం ప్రచురించింది.
ఐడబ్ల్యూఎం బజ్ అనే మీడియా ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఈ చిత్రంలో నటించినందుకు మనోజ్ బాజ్ పేయికి రూ.2.5 కోట్లు చెల్లించారట. ఇక, సమంతకు రూ.1.5 కోట్లు ఇచ్చారట. వీళ్లిద్దరికి మాత్రమే ఎక్కువ మొత్తంలో ముట్టిందట. మిగిలిన నటీనటులకు చాలా తక్కువే చెల్లించారని రాసుకొచ్చింది. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు భారీ మొత్తాలేమీ ఇవ్వలేదని తెలిపింది.
ఇందులో ఏది వాస్తవం అనేది ఎవ్వరికీ తెలియదు. వీటిని ఊహాగానాలుగానే భావించాల్సి ఉంటుంది. అసలు రెమ్యునరేషన్ ఎంతన్నది మేకర్స్ కు, ఇటు నటీనటులకు మాత్రమే తెలుస్తుంది. ఎంత అనేది వాళ్లు బయటకు చెప్పరు. కాబట్టి.. ఈ డిస్కషన్ అలా సాగిపోతూనే ఉంటుంది. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయి, సమంతతోపాటు ప్రియమణి, షఝారీబ్ హష్మీ, శరద్ ఖేల్కర్ తదితరులు నటించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.