విజయాలే కొలమానంగా పరిగణించబడే సినీ పరిశ్రమలో ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వుంది. లేదంటే చిత్ర రంగంలో నిలదొక్కు కోవడం చాలా కష్టం. విజయంతో పాటు డిమాండ్ ఎంత త్వరగా పెరుగుతుందో అపజయంతో పాటు అంతే త్వరగా అపకీర్తి వస్తుంది. అందుకే స్టార్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు వరుస విజయాల కోసం అహర్నిశలు శ్రమించాలి. ఇంకా చెప్పాలంటే తనని తాను ఆ దిశగా మౌల్డ్ చేసుకోవాలి. బాలీవుడ్ టాప్ త్రీ నటుల్లో ఒకడైన సల్మాన్ ఖాన్ తన స్టార్ స్టేటస్ కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కొంటున్నాడు. ఆ క్రమంలో గతం లో తనకి విజయాన్ని తెచ్చి పెట్టిన చిత్రాల్నే నమ్ముకొన్నాడు. వరుసగా సీక్వెల్స్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు. 2012 లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ ఫై నిర్మించబడి సంచలన విజయం సాధించిన ఏక్ థా టైగర్ చిత్రం సల్మాన్ ఖాన్ చిత్రాల్లో ఒక అరుదైన చిత్రం. విభిన్నంగా సాగే స్క్రీన్ ప్లే తో పాటు పసందైన పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రం నిండా పుష్కలంగా ఉంటాయి. అవే చిత్ర ఘన విజయం లో మూల స్తంభాలయ్యాయి. దరిమిలా ఈ చిత్రానికి 2017 లో సీక్వెల్ నిర్మించ బడింది. టైగర్ జిందా హై పేరు తో నిర్మించ బడ్డ ఈ సినిమా కూడా కాసుల వర్షం కురిపించింది. అలా రెండు సార్లు విజయం దక్కించుకున్న ఈ టైగర్ సిరీస్ చిత్రం ఇపుడు మరో సీక్వెల్ కి రెడీ అవుతోంది.
2014 లో సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాల్లో కిక్ సినిమా ఒక ప్రత్యేకమయిన చిత్రం అనక తప్పదు. 2009లో తెలుగులో వచ్చిన రవితేజ కిక్ సినిమా కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. అందుకే ఘన విజయం సాధించింది.అందుకే తెలుగు వచ్చిన అయిదు సంవత్సరాల తరవాత హిందీలో రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ కెరీర్ లో ఒక సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచి పోయింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో సల్మాన్ ఖాన్ ఇపుడు చిత్ర నిర్మాణానికి సిద్దమౌతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ జరుపుకొంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఫై రెండు చిత్రాలే గాక సల్మాన్ ఖాన్ మదిలో మరో సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. 2010 లో తన స్వీయ నిర్మాణ సంస్థ లో నిర్మించబడి ఘన విజయం సాధించిన దబాంగ్ చిత్రానికి మూడో సీక్వెల్ నిర్మించడానికి సిద్దమౌతున్నాడు. దబాంగ్ 4 పేరుతొ నిర్మించబడే ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.