Salaar: ప్యాన్ ఇండియా మూవీ సలార్ దేశవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదలై సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ రికార్డులు బద్ధలు కొడుతోంది. సినిమాలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతున్న ప్రభాస్ సలార్ మూవీ రన్ టైమ్ ఎక్కువే అన్న వార్తలు నిజమయ్యాయి. ప్రశాంత్ నీల్ తన సినిమాల నిడివి పెద్దవిగా ఉంచే ఆనవాయితీని కొనసాగించాడు. అతని చివరి సినిమా కేజీఎఫ్ 2 రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాలుగా ఉంది. తాజాగా సలార్ మూవీ రన్ టైమ్ ఏకంగా 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు కావడం విశేషం.
సెన్సార్.. ఏ సర్టిఫికెట్..
ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ ’ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ యాక్షన్ డ్రామా హింస కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో సలార్ కు అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే 18 ఏళ్లు పైబడిన వాళ్లు మాత్రమే థియేటర్లలో ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేశారు. ఆ రోజు అర్ధరాత్రి 12.30 గంటల నుంచే ఫస్ట్ డే ఫస్ట్ షోలు ప్రారంభం అయ్యాయి.
పడిపోయిన డంకీ వసూళ్లు..
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ నటించిన డంకీ మూవీ డిసెంబర్ 21నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరు సూపర్ స్టార్లలో బాక్సాఫీస్ దగ్గర ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే సలార్‌కు సక్సెస్ టాక్ రావడంతో రెండు రోజులకే డంకీ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సలార్ వసూళ్లు పెరిగాయి.
మైనర్లకు గుంటూరు పీవీఆర్ థియేటర్ షాక్..
ఇదిలా ఉండగా సలార్‌కు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో గుంటూరులో 18 ఏళ్లకన్నా తక్కువ ఉన్నవారిని థియేటర్‌లోకి అనుమతించడం లేదు. ప్రభాస్‌కు టీనేజర్లలో చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ సలార్ చూసేందుకు వెళ్లిన అభిమానులకు గుంటూరు నాజ్ సెంటర్ లోని పీవీఆర్ థియేటర్ యాజమాన్యం షాక్ ఇచ్చింది. 18 ఏళ్లు నిండని వారిని లోపలికి అనుమతించలేదు. టికెట్లు ఇచ్చి థియేటర్‌లోకి అనుమతించకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ యాజమాన్యంతో గొడవ పడ్డారు. టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసుల సూచనతో వారం రోజుల్లో డబ్బులు రీఫండ్ చేస్తామని యాజమాన్యం తెలిపింది. దీంతో గొడవ సద్దుమణిగింది.