Sai Dharma Tej Accident: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. అపోలో ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఆయనకు ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చారు. అయితే ఈ యాక్సిడెంట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మాదాపూర్ లోని ఐకియా ‘దుర్గం చెరువు తీగల వంతెన’పై జరిగిన ఈ ప్రమాదానికి అతి వేగం కారణం కాదని సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
సాయిధరమ్ తేజ్ తలకు హెల్మెట్ పెట్టుకొని.. కాళ్లకు షూస్.. దెబ్బలు తగులకుండా జాకెట్ సహా పకడ్బందీగానే వెళుతున్నట్టు సీసీటీవీ వీడియోలో కనిపించింది. అతడు పెద్దగా స్పీడుగా కూడా వెళ్లడం లేదని.. ప్రమాదకరంగా నడపలేదని సీసీటీవీ ఫుటేజ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
దాదాపు రూ.18 లక్షల విలువ చేసే ఈ ఖరీదైన బైక్ ఎందుకు స్కిడ్ అయ్యింది అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. దీనికి తాజాగా సమాధానం దొరికింది.సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి అసలు కారణం యాక్సిడెంట్ జరిగిన రోడ్డు మీద ఇసుక ఉండడం.. ఆ ఇసుక వల్లే బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. వేగంగా వెళ్లే స్పోర్ట్స్ బైక్ లు ఇసుకలో ఎక్కువగా స్కిడ్ అవుతుంటాయన్న మాట తరచూ వినిపిస్తుంటుంది.
సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన చోట ఇసుక మేట పెట్టి ఉంది. రోడ్డు పక్కనే పనులు జరుగుతుండడం వల్ల అక్కడ ఇసుక మేట వేసినట్టుగా చెబుతున్నారు. వర్షం పడడంతో తడిసి అది జారి ప్రమాదానికి కారణమైంది.
అందుకే ఈ ఉదయం హడావుడిగా జీహెచ్ఎంసీ అధికారులు సాయిధరమ్ ప్రమాదానికి కారణమైన చోట ఇసుకను తొలగించారు. తేజ్ కు ప్రమాదం జరిగినచోట మాత్రమే ఇసుక ఉంది. బ్రిడ్జి రహదారిపై ఎక్కడా ఇలాంటి ఇసుక లేకపోవడం గమనార్హం.
రోడ్డు మీద ఇసుక ఉన్నప్పుడు దానిని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు ఆ పని తొలగించలేదు..? దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అని తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రశ్నించారు.
‘యాక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు.. అదే సమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్ స్ట్రక్షన్ కంపెనీపై, ఎప్పటికప్పుడు రోడ్లు శుభ్రం చేయని మున్సిపాలిటీ వారిపై కూడా కేసు పెట్టాలి. ఈ చర్యల వల్ల నగరంలోని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని నా అభిప్రాయం’ అని ఆర్పీ పట్నాయక్ సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు.
ఇక నెటిజన్లు కూడా ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు. ‘రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే రెండు సెక్షన్లతో తేజ్ మీద కేసు పెట్టిన రాయదుర్గం పోలీసులు.. ఇసుక ఎపిసోడ్ నేపథ్యంలో కేసులు నమోదు చేయాల్సింది బాధితుడి మీదనా?’ అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోడ్డుపై అక్కడ ఇసుక లేనిపక్షంలో బైక్ స్కిడ్ అయ్యే అవకాశమే లేదని.. ప్రమాదానికి కారణం సాయితేజ్ కాదని.. ఇసుక తీయని జీహెచ్ఎంసీ అని పలువురు వాదిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారి మీద చర్యలు తీసుకోవాలన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. మరీ దినిపై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.