
Sai Dharam Tej Accident: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ నడుపుతూ మాదాపూర్ తీగల వంతెనపై నుంచి వెళుతుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంలో దెబ్బ తగిలింది. అదేవిధంగా.. ఛాతి భాగంలోనూ ఎముకలు దెబ్బతిన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో.. మెగా కుటుంబ సభ్యులతోపాటు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అయితే.. కాలర్ బోన్ విరిగిందని తెలిపారు. శరీరంలో అంతర్గతంగా గాయాలేవీ లేవని తెలిపారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు చెప్పారు.
ఇదిలాఉంటే.. సాయితేజ్ యాక్సిడెంట్ కు గురైన ద్విచక్ర వాహనంపై ఒక ట్రాఫిక్ చలానా పెండింగ్ లో ఉన్నట్టు తేలింది. బైక్ రైడింగ్ అంటే సాయి తేజ్ కు చాలా ఇష్టమని చెబుతున్నారు. తాజా ప్రమాదం కూడా అతి వేగంగా బైక్ నడపడం వల్లే జరిగిందని చెబుతున్నారు. వాహనాలను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలోనే వాహనం అదుపుతప్పి, ఈ దుర్ఘటనకు కారణమైందని తెలుస్తోంది. అయితే.. ప్రమాద సమయంలో తలకు హెల్మెట్ ఉండటం వల్లనే సాయితేజ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే.. సాయిధరమ్ తేజ్ బైక్ మీద పెండింగ్ చలానా ఒకటి ఉంది. ఆగస్టు 2వ తేదీన ఆ చలాన్ పడింది. ఈ చాలానా పడడానికి కారణం ఓవర్ స్పీడ్ గా తెలుస్తోంది. స్పోర్ట్స్ బైక్ పై వేగంగా దూసుకెళ్లడం యువతకు చాలా జాలీగా ఉంటుంది. కానీ.. దానివల్ల పొంచి ఉన్న ప్రమాదాలను కూడా పసిగట్టడం అవసరం. లేదంటే.. దారుణాలు జరిగే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇక, సాయితేజ్ ప్రమాద గురించి తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసుపత్రికి తరలి వచ్చారు. ఆయనతోపాటు సినీ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్, హీరో సందీప్ కిషన్ తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ సాయి ఆరోగ్యం గురించి భయపడాల్సిన పనిలేదని, కోలుకుంటున్నాడని చెప్పారు.