
షార్ట్ ఫిల్మ్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి .. ఇరువై మూడేళ్లకే సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు సుజీత్. శర్వానంద్ హీరోగా.. ‘రన్ రాజా రన్’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సుజీత్ ఫస్ట్ మూవీలో తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ వెంటనే ప్రభాస్‌తో ‘సాహో’ అని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముచ్చటగా మూడో చిత్రంలోనే మెగాస్టార్ చిరంజీవికి దర్శకత్వం వహించే చాన్స్ కొట్టేశాడు సుజీత్. లూసిఫర్ తెలుగు రీమేక్‌కు డైరెక్షన్ చేయనున్న ఈ టాలెంటెడ్ యంగ్‌స్టర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
ఈ మధ్యే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ పెళ్లి పీటలు ఎక్కారు. దగ్గుబాటి రానా కూడా అదే బాటలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో 29 ఏళ్ల సుజీత్ కూడా చేరనున్నారు. ప్రవళిక అనే డెంటిస్ట్‌తో గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఎంగేజ్‌మెంట్ రోజే పెళ్లి తేదీ ప్రకటన కూడా వచ్చే చాన్సుంది.