RRR writer Vijayendra Prasad : దర్శకుడిగా రాజమౌళికి ఎంత పేరుందో.. కథా రచయితగా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి అంతే పేరుంది. బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, మగధీర వంటి చరిత్ర లిఖించిన చిత్రాలు ఆయన కలం నుండి జాలువారినవే. రాజమౌళి సక్సెస్ లో విజయేంద్రప్రసాద్ పాత్ర కూడా ఉంది. చాలా వరకు రాజమౌళి సినిమాలకు కథలు అందించేది ఆయనే. భజరంగీ భాయ్ జాన్, మణికర్ణిక బాలీవుడ్ లో అద్భుత విజయాలు సాధించాయి. ఆ చిత్రాల కథా రచయిత విజయేంద్ర ప్రసాదే కావడం విశేషం. అంత గొప్ప సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ తాను కథలు దొంగిలిస్తానని చెప్పడం విశేషంగా మారింది. ఆయన ఏ కాంటెక్స్ట్ లో ఆమాట అన్నారో చూద్దాం..

త్వరలో గోవా వేదికగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరగనుంది. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ఫిల్మ్ రైటింగ్ పై స్పెషల్ సెమినార్స్ ఇచ్చారు. విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అబద్ధాలు చెప్పే వారు మంచి కథా రచయితలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏమీ లేని చోట నుండి ఊహాజనితంగా ఆసక్తికర విషయాలు రచయిత వెలికితీయాలి అన్నారు.
సమాజంలో మన చుట్టూ అనేక కథలు ఉంటాయి. వాటిని మనం గమనించాలి. నేను కథలు రాయను, దొంగిలిస్తాను. సమాజం నుండి, రామాయణ, మహాభారతం, చరిత్ర వంటి ఇతిహాసాల నుండి కథలు తీసుకోవాలి. నేను కూడా అక్కడ నుండే కథలు సృష్టిస్తాను. దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకులు మెచ్చేలా మన కథలు ఉండాలి, అని విజయేంద్ర ప్రసాద్ సినిమా రచనపై యువ రచయితలకు అవగాహన కల్పించారు. విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా నియమింపబడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన మహేష్ మూవీ కోసం కథను సిద్ధం చేస్తున్నారు. కథ పూర్తి కాగా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు కథే ఈ చిత్రమని రాజమౌళి తెలియజేశారు. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ అని తెలియజేశారు. మహేష్ మూవీతో పాటు ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ పై కూడా విజయేంద్ర ప్రసాద్ పని చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఉంటుంది, విజయేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తున్నారని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. మహేష్ మూవీ భారీ ఎత్తున తెరకెక్కనుంది.