RRR: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ లో రాజమౌళి జోరు పెంచాడు. తన ఇద్దరు స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఇప్పుడు ముంబైలో తిష్టవేసి అక్కడి టాప్ మీడియాకు, టాప్ టీవీ షోలకు వెళుతూ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ ను ఓ రేంజ్ కు తీసుకెళుతున్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ చెప్పిన ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. రాజమౌళి ఎంత పర్ ఫెక్షనిస్టునో తెలియవచ్చింది. రాజమౌళి ప్రతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడని అర్థమైంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన ఫైట్ సీక్వెన్స్ కోసం రాజమౌళి ఏకంగా 65 సార్లు షూటింగ్ చేశాడన్న విషయాన్ని ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అది విని అంతా షాక్ అయిన పరిస్థితి. సన్నివేశాల విషయంలో జక్కన్న ఎంత ఖచ్చితంగా ఉంటాడో దీంతో తెలియవచ్చింది.
రాజమౌళి ప్రతి విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అప్పుడప్పుడూ హీరోల ఆలోచనలు కూడా తీసుకుంటాడని తెలిసింది. ఇక రాంచరణ్ అయితే రాజమౌళి కథ వినకుండానే ఆర్ఆర్ఆర్ కు ఓకే చెప్పాడట.. ఇలా సుకుమార్ ‘రంగస్థలం’కు కూడా కథ వినకుండానే చేశాడట రాంచరణ్. అయితే అందరికీ అలా చేయనని.. దిగ్గజ దర్శకులతో మాత్రమే అలా చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఆర్ఆర్ఆర్ దేశభక్తి సినిమా కాదని.. కేవలం స్నేహితుల మధ్య స్నేహం గురించి మాత్రమే వివరించే సినిమా అని రాజమౌళి సంచలన విషయాలను పంచుకున్నారు. ఇక తాను ఇప్పటికీ జనగణమన వింటే కన్నీళ్లు వస్తాయని రాజమౌళి వివరించారు. ఆర్ఆర్ఆర్ కథలో నా పాత్రలకు ఎన్టీఆర్, రాంచరణ్ అయితే న్యాయం చేయగలరన్న నమ్మకం వచ్చింది. అందుకే వాళ్లను తీసుకున్నానని రాజమౌళి తెలిపారు.
బాహుబలిలో నీటిలో మునిగిపోతూ శివగామి చేతిలో బిడ్డను పైకి ఎత్తి చూపించిన సీన్ వావ్ అనిపిస్తుందని.. అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో రాజమౌళి చెప్పాలని సీక్రెట్ ను హిందీ జర్నలిస్టులు అడిగేశారు. ప్రేక్షకులను అలరించాలని.. వారు సీన్ లో ఎమోషన్ ని కూడా జోడించి చూపించినప్పుడే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారన్నది నా భావన అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇలా ఆర్ఆర్ఆర్ గురించి ఎవరికి చెప్పని రహస్యాలను కూడా రాజమౌళి లీక్ చేస్తూ బాలీవుడ్ లో సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు.