RRR Japan Collections: ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి మార్కెట్ ఉంది. రజనీకాంత్ చిత్రాలను అక్కడి ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. 3 ఇడియట్స్, ముత్తు, బాహుబలి 2 వంటి చిత్రాలు అక్కడ భారీ ఆదరణ దక్కించుకున్నాయి. దీంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని జపాన్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. అక్టోబర్ 21న ఆర్ ఆర్ ఆర్ విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం దర్శకుడు రాజమౌళితో పాటు ఇద్దరు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ వెళ్లారు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు బాగా ప్రయత్నం చేశారు. స్థానిక చిత్ర ప్రముఖులను కలవడం చేశారు. లోకల్ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొనడం, అభిమానులతో ఫోటో దిగడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రాజమౌళి కోరుకున్న విధంగా ఆర్ ఆర్ ఆర్ కి జపాన్ లో హైప్ ఏర్పడింది. ఆర్ ఆర్ ఆర్ చెప్పుకోదగ్గ ఆరంభం అందుకుంది. వసూళ్లు నిలకడగా సాగుతున్నాయి. జపాన్ బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ మూవీ 17 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇక వసూళ్లు చూస్తే ¥ 185 మిలియన్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. దీంతో థర్డ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ రికార్డులకు ఎక్కింది.
అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ వసూళ్లను ఆర్ ఆర్ ఆర్ దాటివేయడంతో ఆ మూవీ నాలుగో స్థానానికి పడిపోయింది. అయితే బాహుబలి 2, ముత్తు చిత్రాలకు ఇంకా చాలా దూరంలో ఉంది. చాలా కాలంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ముత్తు కొనసాగుతుంది. రజినీకాంత్ హీరోగా నటించిన ఆ మూవీ ¥ 400 మిలియన్ వసూళ్లతో టాప్ వన్ పొజీషన్ లో ఉంది. తర్వాత ¥330 మిలియన్ వసూళ్లతో బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది.

కనీసం బాహుబలి 2 ను దాటాలన్నా ఆర్ ఆర్ ఆర్ మరో ¥ 180 మిలియన్స్ వసూలు చేయాలి. జపాన్ థియేటర్స్ లో బాహుబలి 2 వంద రోజులు ఆడటం విశేషం. దీంతో ప్రభాస్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ దేశంలో ఏర్పడింది. బాహుబలి 2 చిత్ర దర్శకుడిగా ఉన్న రాజమౌళికి కూడా జపాన్ దేశంలో ఫేమ్ ఉంది. మరి ఆర్ ఆర్ ఆర్ రన్ ముగిసే నాటికి ఎంత వసూలు చేస్తుందో చూడాలి. నిర్మాత డివివి దానయ్య రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో ఆర్ ఆర్ ఆర్ నిర్మించారు. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు.