
కరోనా బారిన పడి దాదాపు నెలరోజులు విశ్రాంతి తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇప్పుడు లాక్ డౌన్ వేళ పూర్తిగా కోలుకున్నారు. మునుపటి స్థాయికి వచ్చారు. ఆ మధ్య కరోనాతో ఒంటరిగా క్వారంటైన్ లో ఉన్న ఫొటో షేర్ చేసి విషాద గీతాలు ఆలపించిన ఈ ముద్దు గుమ్ము ఇప్పుడు షూటింగ్ కు రెడీ అయ్యారు.
ఆలియా భట్ ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’తోపాటు.. హిందీలో సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న ‘గంగూభాయ్ కథియావాడీ’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఆ సినిమా దాదాపు పూర్తి అయ్యింది. ఒక్క పాట మాత్రమే మిగిలి ఉంది. దీంతో ప్రస్తుతం మహారాష్ట్రలో షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడంతో ఆ పాటను పూర్తి చేయాలని ఆలియా భట్ డిసైడ్ అయ్యింది. ఈ మేరకు దర్శకుడు భన్సాలీకి సమాచారం అందించింది. జూన్ 15 తర్వాత ఈ షూటింగ్ లో ఆలియా భట్ పాల్గొననుంది.
గంగూభాయ్ కు కొబ్బరికాయ కొట్టిన అనంతరం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో తాను పాల్గొననున్నట్టు ఆలియా భట్ దర్శకుడు రాజమౌళికి సమాచారం ఇచ్చారట.. ఈ మేరకు షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారట..
దీంతో రాజమౌళి అండ్ టీం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ట్రై చేస్తున్నట్టు తెలిసింది. ఆర్ఆర్ఆర్ కొత్త షెడ్యూల్ లో ‘ఆలియా భట్’ సీన్లను పూర్తి చేయడానికి రాజమౌళి రంగం సిద్దం చేస్తున్నట్టు తెలిసింది.