Carl Weathers: రాకీ.. ఈ పేరులోనే వైబ్రేషన్ ఉందనుకుంటా. అందుకే ఈ ఒక్క పేరు కన్నడ సినీ పరిశ్రమను సమూలంగా మార్చేసింది. యష్ అనే నటుడిని రాకీ భాయ్ ని చేసేసింది. గూగుల్ లో రాకీ అని టైప్ చేస్తే యష్ ను చూపిస్తుందంటే కేజీఎఫ్ సినిమా హవాను, అది కలిగించిన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. గూగుల్ గాని, మనం గాని రాకీ అంటే చాలు యష్ అని చెప్పేస్తున్నాం. కానీ ఆ పేరుకు ఓ నటుడు తీసుకొచ్చిన స్టార్ డం అంతా ఇంతా కాదు. ఇంతకీ ఎవరు అతను? అంత గొప్ప పాత్రలు పోషించాడా? అతడు కన్ను మూస్తే హాలీవుడ్ ఎందుకు కన్నీరు పెడుతోంది? ఇంకా మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కార్ల్ వెదర్స్.. ఈ పేరు కంటే రాకీ అంటేనే అతడిని చాలామంది గుర్తుపడతారు. 76 సంవత్సరాల వయసులో గురువారం అమెరికాలో తెల్లవారుజామున అతడు మృతిచెందాడు. కార్ల్ వెదర్స్ నటుడు మాత్రమే కాదు. పేరు మోసిన ఆటగాడు కూడా.. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ సరసన రాకీ పాత్రలో అనేక సినిమాల్లో అతడు నటించాడు. జనవరి 14 1948 న న్యూ ఓర్లిన్స్ లో కార్ల్ వెదర్స్ జన్మించారు. తన 50 ఏళ్ల నట జీవితంలో 75 కంటే ఎక్కువ సినిమాల్లో ఆయన నటించారు. టీవీ షోలలో కూడా కనిపించారు. హి గ్రీఫ్ కర్గా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వార్స్ సిరీస్ ది మాండలోరియన్ మూడు సీజన్ లలో ని 9 ఎపిసోడ్లలో ఆయన నటించారు. 1976 లో రాకీ చిత్రంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా అతడిని హాలీవుడ్ లో తిరుగులేని స్టార్ ను చేసింది. ఇదే క్రమంలో 1979 లో రాకీ_2, 1982 లో రాకీ_3 సినిమాల్లో కూడా నటించారు. అవి కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. 1985 లో రాకీ_4 చిత్రం కార్ల్ వెదర్స్ కి చిరస్మరణీయ విజయాన్ని అందించింది. 1987 లో ప్రిడేటర్ అనే సినిమాలో కూడా కార్ల్ వెదర్స్ గుర్తుండిపోయే పాత్రలో నటించాడు.. ఆడమ్ శాండ్లర్ దర్శకత్వం వహించిన హ్యాపీ గిల్మోర్ అనే సినిమాలో మంచి పాత్రను పోషించారు.
కార్ల్ వెదర్స్ నటుడు మాత్రమే కాదు ఫుట్ బాల్ ప్లేయర్ కూడా. 1974లో సినిమాల్లోకి రాకమందు అతడు ఫుట్ బాల్ ఆటగాడిగా పలు టోర్నీల్లో పాల్గొన్నాడు. ఫుట్ బాల్ లీగ్ లో ఓక్లాండ్ రైడర్స్ తరఫున అతడు ఆడేవాడు. హాలీవుడ్ లోకి ప్రవేశించిన తర్వాత సిల్వెస్టర్ స్టాలోన్ తో కలిసి పలు సినిమాల్లో నటించాడు. అపోలో క్రీడ్ పాత్రల్లో ఒదిగిపోయాడు. అతడు రాకీ సీరిస్ లో నటించిన పాత్రలు లెజెండ్ బాక్సర్ మహమ్మద్ అలీని గుర్తుకు తెచ్చేవి. ఆ తర్వాత కొంతకాలానికి మహమ్మద్ అలీ ని ప్రేరణగా తీసుకొని రాఖీ సీరిస్ సినిమాలు రూపొందించారని వెదర్స్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వెదర్స్ మరణం పై హాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.. గొప్ప నటుడిని కోల్పోయామని సంతాపం ప్రకటించింది. సుప్రసిద్ధ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ వెదర్స్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. వెదర్స్ లేకుండా ప్రిడేటర్ సినిమా తీసే వాళ్ళమే కాదని వ్యాఖ్యానించాడు. హాలీవుడ్ లో నల్ల జాతి ఆస్తిత్వాన్ని ఘనంగా చాటని ఇంకా పలువురు నటులు కొనియాడారు.
Carl Weathers will always be a legend. An extraordinary athlete, a fantastic actor, and a great person. We couldn’t have made Predator without him. And we certainly wouldn’t have had such a wonderful time making it. pic.twitter.com/q4CWVVeyTK
— Arnold (@Schwarzenegger) February 2, 2024