
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా న్యూసే. ఎదురుగా ఉన్నది ఎవరు అన్నదానితో సంబంధం లేకుండా తాను.. ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పేస్తాడు. ఎవరి మనోభావాలతో సంబంధం లేకుండా ఓపెన్ అయిపోతాడు. తాజాగా.. రాజమౌళి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ముందే వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి మొదలు పెట్టి రాజమౌళిని టార్గెట్ చేశాడు ఆర్జీవీ. తాజాగా.. సునిల్ హీరోగా తెరకెక్కిన ‘కనబడుట లేదు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు రామ్ గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైక్ అందుకోగానే సెటైర్లు వేయడం మొదలు పెట్టారు.
‘‘ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారం చెప్పట్లేదు. ఎందుకంటే.. నా లైఫ్ లో ఎప్పుడూ ఎవరికీ నమస్కారం పెట్టింది లేదు. అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ‘కనబడుట లేదు’ గురించి మాట్లాడడానికి ముందు నాకు ఒక డౌట్. ఇందాక విజయేంద్ర ప్రసాద్ గారిని ఒక విషయం అడుగుదామని అనుకున్నాను. కానీ.. మ్యూజిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయనకు అర్థం కాదేమో అని చెప్పలేదు. కొన్ని వారాలుగా నేను విజయేంద్ర ప్రసాద్ గారిని గమనిస్తున్నాను. నా పెద్ద డౌట్ ఏటంటే.. మీ గడ్డానికి స్ఫూర్తి ఎవరు?’’ అని ప్రశ్నించారు.
ఇంకా ఇదే విషయమై మాట్లాడారు. ‘‘మీ గడ్డానికి స్ఫూర్తి నరేంద్ర మోడీనా? లేకపోతే రామాయణాన్ని మించిన అద్భుతమైన బాహుబలి కథను ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే పెద్దగా ఉండాలని అనుకున్నారా? నా గెస్సింగ్ ఏమిటంటే.. బోడి నా కొడుకు రాజమౌళిదే అంత అంటే.. నాది ఇంకెంత పెద్దగా ఉండాలి? అని అనుకుని ఉంటారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలకు విజయేంద్రప్రసాద్ నవ్వుతూ ఆర్జీవీకి రెండు చేతులెత్తి దండం పెట్టేశారు.
అంతకు ముందు విజయేంద్ర ప్రసాద్ కూడా ఆర్జీవీపై సెటైర్లు వేశారు. ఎలాంటి అనుభవం లేకుండా సినిమా మీద ప్యాషన్ వచ్చి కుర్రాళ్లతో సైకిల్ చైన్ పట్టించిన వ్యక్తి ఇప్పుడు కనిపించట్లేదు అని అన్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన డైరెక్టర్ నాకు ఇప్పుడు కనిపించట్లేదు అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాట్లాడరేమో తెలియదుగానీ.. మొత్తంగా విజయేంద్రప్రసాద్ మీదుగా రాజమౌళి వరకూ టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.