వైవిధ్యమైన కథలు తెరకెక్కించడంలో దర్శకుడు రాంగోపాల్ వర్మది అందెవేసిన చేయి. మొదటి నుంచి ఆయన చిత్రాల్లో ఏదో వాస్తవికత ఉట్టిపడుతూనే ఉంటుంది. శివ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పటివరకు ఎన్నో విలక్షణ చిత్రాలు నిర్మించే వరకూ సాగింది. ‘బయోపిక్ లను తీయడంలో వర్మ తర్వాతే ఎవరైనా.. తెలంగాణ రక్త చరిత్ర పేరుతో ఓ సినిమా నిర్మించేందుకు వర్మ తాజాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల కిందటి పరిస్థితుల నేపథ్యంలో సినిమా తీస్తున్నట్లు సమాచారం. కొండా మురళి, మావోయిస్టు నేత ఆర్కే సాగించిన పోరాటాలను దృశ్య కావ్యంగా మలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వివాదాస్పద దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. ఆయన ఎప్పుడు వార్తల్లోనే ఉంటారు. వైవిధ్యమై చిత్రాలతో తన సత్తా చాటుకుని తనదైన శైలిలో చిత్రాలు నిర్మించడంలో ఆయనకు ఆయనే సాటి. శివ సినిమాతో తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ గుర్తింపును సాధించుకున్నారు. తెలుగుతోపాటు హిందీలో కూడా పలు చిత్రాలు నిర్మించి సత్తాచాటారు.. పలు వివాదాస్పద విషయాలు చిత్రాలుగా మలచడంలో ఆయనదో ప్రత్యేక స్టైల్. రక్త చరిత్రతో ఫ్యాక్షనిజాన్ని తెర మీద చూపించారు.
దెయ్యాలు, క్రైం తదితర విషయాలపై కూడా చిత్రాలు తీసి ప్రేక్షకులను మెప్పించిన ఘనత వర్మదే. అయితే ఇన్నాళ్లు రాజకీయ కోణాల్లో సినిమాలు తీసిన ఆయన ప్రస్తుతం రాజకీయాలే వేదికగా సినిమాలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో రక్తచరిత్ర పేరుతో పరిటాల రవి జీవిత వృత్తాంతాన్ని సినిమాగా తీసి మెప్పించారు. ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆయన ఎప్పటికప్పుడు తన శైలి మార్చుకుంటూనే ఉంటారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన కొండా మురళి, సురేఖలతో తెలంగాణ రక్త చరిత్రను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను వరంగల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వర్మ చేయబోయే ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది.
అయితే కొండా మురళి, మావోయిస్టు నేత ఆర్కే అప్పట్టో జరిపిన పోరాటాలనే ఇతివృత్తంగా తీసుకొని సినిమాగా మలచనున్నట్లు తెలుస్తోంది. దీనికి కొండా మురళి కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో వర్మ తదుపరి సినిమా ఇదేనని.. దీనిపై కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో తిరుగుబాటు ప్రధానాంశంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వర్మ ఈ సినిమా ద్వారా తెలంగాణ పాలిటిక్స్ ను ఏ మేరకు షేక్ చేస్తాడన్నది వేచిచూడాలి