
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ తెలుగులో ‘వకీల్ సాబ్’గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్లు గతకొంతకాలంగా సోషల్ మీడియాలో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా రేణుదేశాయ్ స్పందించారు.
కల్యాణ్‌గారి సినిమాలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇలాంటి రూమర్లను దయచేసి ఎవరూ నమ్మవద్దన్నారు. కరోనా లాంటి మహమ్మరి ప్రజలను బెంబెలెత్తిస్తున్న సమయంలోనూ ఇలాంటి రూమర్లను కొందరు ప్రచారం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. దయచేసి ఇలాంటి రూమర్స్ పుట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీఒక్కరూ స్వీయనియంత్రణ పాటించి కరోనా మహమ్మరిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సూచనలు పాటించాలని రేణుదేశాయ్ కోరారు.
‘వకీల్ సాబ్’ మూవీని వేణు శ్రీరామ్ తెరెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నివేథా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. పవన్ జోడీగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మూవీని దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.