Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కి నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలవడం అలవాటు పోయింది. ఇతగాడికి స్టార్ డమ్ ఎంత ఉంది అనే సంగతి పక్కన పెడితే.. తనను తాను మాత్రం బాగా ప్రమోట్ చేసుకుంటాడు. ఈ క్రమంలో గుర్తింపు కోసం అప్పుడప్పుడు కాంట్రవర్సీస్‌తో హాట్ టాపిక్ గా కూడా నిలవడానికి మొహమాట పడడు. ఇటీవల ఓ మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు లేకుండా ఈ హీరో గారు న్యూడ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు.

ఆ ఫోజులు ఇచ్చి.. పైగా తాను ఏదో పెద్ద ఘనకార్యం చేసినవాడిలా తెగ ఫోజులు ఇచ్చాడు. కట్ చేస్తే.. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ తర్వాత పలువురు రణ్‌వీర్ సింగ్‌పై మండిపడ్డారు. అతని పై ఎన్నో విమర్శలు వచ్చాయి. భారతదేశంలోని సాంప్రదాయ వాదులు అంతా ఈ ఫోటోలను తీవ్రంగా వ్యతిరేకించారు.
ఇలా బట్టలు లేకుండా కెమెరాకి ఫోజులు ఇవ్వడం భారతీయ సాంప్రదాయానికి విరుద్ధమని, ఇలాంటి చేష్టలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయని సాంప్రదాయ వాదులు కొందరు గట్టిగా వాదించారు. పైగా రణ్‌వీర్ సింగ్ పై పోరాటానికి కూడా దిగారు. ఈ క్రమంలో న్యాయ పోరాటానికి కూడా కసరత్తులు చేశారు. ఫలితంగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ షోపై వ్యతిరేకత ఎక్కువ అయ్యింది.

ఓ దశలో రణ్‌వీర్ సింగ్ ఇంటి ముందు కొందరు ఆందోళన చేయడం కూడా జరిగింది. ఎవరెన్ని చేసినా ఇన్నాళ్లు రణ్‌వీర్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ రంగంలోకి దిగారు కొందరు సాంప్రదాయ వాదులు. అతని పై విరుచుకు పడ్డారు. పైగా అతనిని ఇరకాటంలో పడేసేలా చర్యలు చేపట్టారు. దాంతో రణ్‌వీర్ సింగ్ తగ్గాడు. తన ఫొటోను మార్ఫింగ్ చేశారని తాజాగా రణ్‌వీర్ సింగ్ వెల్లడించాడు.
ఫొటోషూట్‌లో పాల్గొన్న ఫొటోల్లో ఒకదానిని టాంపరింగ్ చేసి మార్ఫింగ్ చేశారని ఈ హీరో ఆరోపించాడు. ఫొటోషూట్ కేసు దర్యాప్తులో భాగంగా రణ్‌వీర్‌ను పోలీసు అధికారులు వివరణ కోరారు. దీంతో విచారణలో ఇతగాడు ఈ విషయం తెలిపాడు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా తన ఫొటోషూట్ ఉందని అతడిపై కేసు నమోదైంది. ఈ ఫొటోషూట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.