Virata Parvam Movie Review: నటీనటులు: రానా, సాయి పల్లవి, ప్రియమణి, ఈశ్వరి రావు, నవీన్ చంద్ర, నివేత పేతు రాజ్
దర్శకత్వం: వేణు ఉడుగుల
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు: సురేష్ బాబు డి, సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: డానియల్ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
విరాటపర్వం… ఆ టైటిల్ కి తగ్గినట్లుగానే చాలా కాలం అజ్ఞాతంలో ఉండిపోయింది ఈ సినిమా. ఎప్పుడో ఓ ఏడాది క్రితం విడుదల కావాల్సిన విరాటపర్వం ఎట్టకేలకు థియేటర్స్ కి వచ్చింది. జూన్ 17న విరాటపర్వం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. సాయి పల్లవి-రానా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించారు. కాంబినేషన్ రీత్యా ఈ సినిమాపై హైప్ ఏర్పడింది. మరి ఆ హైప్ అంచనాలు సినిమా అందుకుందో లేదో చూద్దాం…
Also Read: Chiranjeevi Vs Ballaya: దసరా కి చిరు vs బాలయ్య.. ఎవరు గెలుస్తారో చూడాలి
కథ
విరాటపర్వం కథ అందరికీ తెలిసిందే. రెండు నిజ జీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. విద్యార్థి దశ నుండి సామాజిక, విప్లవ భావాలు అలవర్చుకున్న రవన్న(రానా) నక్సల్ గా మారతాడు. అయితే రవన్న అంటే వెన్నెల(సాయి పల్లవి)కి ప్రాణం. అతన్ని ఎంతో ప్రేమిస్తుంది. నక్సల్ గా మారిన రవన్న ఆమెకు దూరమైపోతాడు. దీంతో వెన్నెల అతడి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. చివరికి ప్రేమించిన రవన్నను వెతుక్కుంటూ అడవి బాట పడుతుంది. మరి వెన్నెల, రవన్న కలుసుకున్నారా? తర్వాత ఏర్పడిన పరిణామాలు ఏమిటీ? వెన్నెల-రవన్నల ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ…
విశ్లేషణ:
90లలో నక్సల్ నేపథ్యంలో తెరకెక్కిన చాలా చిత్రాలు విజయం సాధించాయి. అప్పటి ప్రేక్షకుల్లో ఆ తరహా చిత్రాల పట్ల ఆసక్తి ఉండేది. ఆర్ నారాయణ మూర్తి సైతం నక్సల్ నేపథ్యంలో సినిమాలు తీసి విజయం సాధించారు. అయితే నక్సల్ ప్రభావం, సోషలిస్ట్ భావాలు కలిగిన యువత నేడు చాలా తక్కువ. దాని పట్ల అవగాహన ఉన్నవారు కూడా అరుదే. కాబట్టి విరాటపర్వం ఇప్పటి ట్రెండ్ మూవీ కాదు. అయినప్పటికీ ఆకట్టుకునేలా చెప్పడం ద్వారా విజయం సాధించవచ్చు. ఈ విషయంలో దర్శకుడు పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు.
సాయి పల్లవి పాత్రలో లవ్, ఎమోషన్స్ తో పాటు చక్కని సంఘర్షణ ఉంది. ఆమె పాత్ర ద్వారా ప్రేక్షకుల హృదయాలను కదిలించవచ్చు. కానీ అది జరగలేదు. వెన్నెల రవన్న అంతగా అభిమానించడానికి, ప్రేమించడానికి బలమైన కారణం కనిపించదు. సాయి పల్లవి పాత్ర ద్వారా చెప్పాలనుకున్న ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. ఎటువంటి కమర్షియల్ అంశాలు టచ్ చేయకుండా అనుకున్న కథ నిజాయితీగా చెప్పాలనుకున్నాడు. దీనికోసం ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లేలో పట్టులేదు.
కేవలం కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే విరాటపర్వం చాలా వరకు బోరింగ్ సాగుతుంది. అద్భుతమైన క్యాస్టింగ్ ఎంచుకొని వాళ్ళను సరిగా ఉపయోగించుకోలేదన్న భావన కలుగుతుంది. సాయి పల్లవి, రానా ఒకరికి మించిన నటులు మరొకరు. ప్రాణం లేని కథనంలో వారి నటన కూడా సినిమాను కాపాడలేకపోయింది. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. ఆర్ట్ వర్క్, కెమెరా పనితనం మెప్పించాయి. కీలక రోల్స్ చేసిన ప్రియమణి, ఈశ్వరరావు ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్
సంగీతం
సాయి పల్లవి, రానా నటన
కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
కమర్షియల్ అంశాలు లేకపోవడం
దర్శకత్వం
సినిమా చూడాలా? వద్దా?
ఓ అబ్బాయి ప్రేమ కోసం తాపత్రయ పడ్డ అమ్మాయి అనే ఎమోషనల్ పాయింట్ దర్శకుడు మెప్పించేలా తెరకెక్కించలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే చాలా వరకు సినిమా నిరుత్సాహంగా సాగుతుంది. సాయి పల్లవి, రానా నటన కోసం ఓ సారి చూడొచ్చు. అలనాటి నక్సల్ భావజాలం, సామాజిక పరిస్థితులు తెలుసుకోవాలని అనుకునేవారు ఓ ప్రయత్నం చేయవచ్చు.
రేటింగ్: 2.5
Also Read: Sudigali Sudheer Remuneration: కొత్త షోకు సుడిగాలి సుధీర్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?