
‘హీరో రానా దగ్గుబాటి’ పెద్ద మనసు చాటుకున్నారు. సిటీలోని పేద ప్రజలకు ఏదో రకంగా ఎవరొకరు నుండి సాయం అందుతుంది. కానీ ఈ అధునాతన సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఆటవిక సమాజంలోని పేదలకు సాయం చేసేది ఎవరు ? పరిస్థితులు బాగున్నప్పుడే వారిని పట్టించుకునే నాధుడు ఉండడు. అలాంటిది ఈ క్లిష్ట సమయంలో ఆదుకునే వాడు ఎవడు ఉంటాడు.
పైగా ఈ కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా గిరిజన తెగలలో సంచారమే లేకుండా పోయింది. అనేక పేద కుటుంబాలు నిత్యావసరాల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. దగ్గు, జలుబు లాంటి చిన్న సమస్యలకు కూడా మెడిసిన్ దొరకని పరిస్థితిలో గిరిజన కుటుంబాలు మగ్గిపోతున్నాయి. ఇక అలాంటి కుటుంబాలలో కరోనా వస్తే..
వారి బాధను మాటల్లో వర్ణించలేం. అయితే, హీరో రానా దగ్గుబాటి నిజంగానే వారి దృష్టిలో హీరో అనిపించుకున్నాడు. తనవంతుగా 400 గిరిజన కుటుంబాలకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. నిర్మల్ జిల్లాలోని గిరిజన కుటుంబాలకు అవసరమైన కిరాణా సామాగ్రితో పాటు కొన్ని చిన్నపాటి జబ్బులకు సంబంధించి మందులను అందించారు.
సరుకులు అందుకున్న గిరిజన కుటుంబాలు రానాకి కృతజ్ఞతలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కడుపు నిండా భోజనం చేసి చాలా రోజులు అయిందని, రానాగారి దయ వల్ల తృప్తిగా భోజనం చేస్తామని వారు ఎమోషనల్ అయ్యారు. ఏది ఏమైనా, రానా ఇలాంటి వారికి సాయం చేయడం మెచ్చుకోదగ్గ అంశం. ఇక రానా ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో కలిసి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు.