
కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా లక్షా 84 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఇదే ఆల్ టైమ్ రికార్డు. ఈ తీవ్రత ఎంత దూరం వెళ్తుందో అర్థం కాకుండా ఉంది. దీంతో.. రక్షణ చర్యలు తీసుకోవడం అనివార్యంగా మారింది. అయితే.. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా.. గరిష్ట ప్రభావం సినిమా ఇండస్ట్రీపై పడే సూచనలు కనిపిస్తుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
కొవిడ్ మొదటి దశలోనూ ఎక్కువగా ఇబ్బంది పడ్డది సినిమా ఇండస్ట్రీనే. లాక్ డౌన్ తర్వాత అక్టోబరులో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చినా.. దాదాపు జనవరి వరకు ఓపెన్ కాలేదు. ఇక, అంతా మంచి కాలమే అనుకునేలోపు మళ్లీ పరిస్థితి మొదటికి వస్తోంది. కేవలం మూడు నెలలు మాత్రమే సినిమా థియేటర్లు సరిగ్గా తెరుచుకున్నాయి. ఇప్పడు సెకండ్ వేవ్ దూసుకొస్తుండడంతో.. సినిమాలన్నీ వెనక్కు వెళ్లిపోతున్నాయి.
కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే.. చాలా రాష్ట్రాలు 50 శాతం నిబంధన అమల్లోకి తెచ్చాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా మూసేసే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిపై ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. అయితే.. పూర్తిగా థియేటర్లను మూసేయకపోవచ్చుగానీ.. 50 శాతం నిబంధన అమలు చేయడం తథ్యంగా కనిపిస్తోంది.
ఈ కారణం చేతనే సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఏప్రిల్ 16న రావాల్సిన శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ ఎప్పుడో వాయిదా పడింది. ఆ తర్వాత వారం రావాల్సిన ‘టక్ జగదీష్’ కూడా వెనక్కు వెళ్లిపోయాడు. ఇప్పుడు.. రానా వంతు వచ్చింది. సాయిపల్లవి-రానా జంటగా నటించిన ‘విరాట పర్వం’ ఈ నెల 30 విడుదల కావాల్సి ఉంది. కానీ.. ఈ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు మేకర్స్.
ఇక, మే నెలలో రావాల్సిన పెద్ద చిత్రాలు కూడా వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నెలలో చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, బాలకృష్ణ అఖండ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. కానీ.. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. అవి కూడా వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరి, ఈ ప్రభావం ఇంకా ఎంత దూరం వెళ్తుందో..? ఎన్ని రోజులు కొనసాగుతుందో? అనే ఆందోళన వ్యక్తమవుతోంది ఇండస్ట్రీలో.