Vyuham Movie: ఏపీ రాజకీయాలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంధిస్తున్న మరో అస్త్రం ‘వ్యూహం’. తాజా రాజకీయ పరిణామాలను కథా వస్తువుగా తీసుకొని ఆర్జీవి పొలిటికల్ హై ఓల్టేజ్ పిక్చర్ గా తీర్చిదిద్దుతున్నారు. గతంలో వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ కుమారే ఈ చిత్రానికి నిర్మాత. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలైంది. రోజుకో పాత్రధారుల ఫొటోలను విడుదల చేస్తున్న ఆర్జీవీ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ముందుగా సీఎం జగన్, ఆయన భారతీరెడ్డి పాత్రధారుల ఫొటొలను రిలీజ్ చేశారు. జగన్ గా తమిళ నటుడు అజ్మల్, భారతిగా మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్స్ ను ఆర్జీవీ ఎప్పటికప్పుడు తన ట్టిట్టర్ ఖాతా ద్వారా విడుదల చేస్తున్నారు.
అటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సైతం తనదైన స్టైల్ లో చూపించారు. చిత్రం ఎలా ఉండబోతోంది అన్నదానిపై సంకేతాలిచ్చారు. వ్యూహం రెండు పార్టులుగా చిత్రీకరణ జరుగుతోంది. వైఎస్ హఠాన్మరణంతో తొలి పార్టు ప్రారంభమవుతుంది. అప్పటివరకూ ఉన్న జగన్ జీవితం అకస్మాత్తుగా తలకిందులైందని చూపడంతో పాటు ఓదార్పుయాత్ర, ఢిల్లీ పెద్దల అడ్డగింతలు, వైసీపీ ఆవిర్భావం, సీబీఐ కేసులు చుట్టిముట్టడం, జైలు జీవితం వంటి కథాంశంతో తొలి పార్టు ఉండనుంది. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెండోపార్టులో మాత్రం 2014 తదనంతర పరిణామాలు చూపనున్నారు. అసెంబ్లీలో చంద్రబాబుపై పోరాటం, అటు తరువాత మహా ప్రస్థానం పేరిట జగన్ చేసిన పాదయాత్రను హైలెట్ చేయనున్నారు. 2019 ఎన్నికల తరువాత జగన్ ప్రభుత్వం ఏర్పాటు, సంక్షేమ పథకాలు వంటి వాటిని ప్రస్తావించనున్నారు. గత నాలుగేళ్లుగా విపక్షాల పోరాటానికి తన వ్యూహాలతో జగన్ ఎలా అధిగమించారో ఆర్జీవీ చూపనున్నారు. అయితే జగన్ కు ఫేవర్ చేసే విధంగానే ఈ చిత్రాల రూపకల్పన ఉండనున్నట్టు తెలుస్తోంది. టీజర్ కూడా దానినే తెలియజేస్తోంది.
అయితే వ్యూహంలో మెగా బ్రదర్స్ కు ఆర్జీవీ చోటు కల్పించారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కు ఒకే ప్రేమ్ లోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత చిరంజీవిని పవన్ కలిసి వెళుతున్నట్టు ఒక స్టిల్ ను ఆర్జీవీ తన ట్విట్టర్ లో పోస్టుచేశారు. దీంతో అంచనాలు మరింత రెట్టింపవుతున్నాయి. వ్యూహం రెండో పార్టులో జగన్, చంద్రబాబులతో పాటు పవన్ పాత్రకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని ఆర్జీవీ సంకేతాలు పంపారు. అయితే ఎన్నికల ముందు ఆర్జీవీ తీసిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. మరి వ్యూహం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి మరీ.