David Reddy : ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో తన విభిన్నమైన సినిమాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న మంచు మనోజ్(Manchu Manoj), మధ్యలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమై, పదేళ్ల గ్యాప్ తర్వాత రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ లో ఆయన హీరో గా కాకుండా, విలన్ గా నటించి, ఆడియన్స్ కి తనలోని సరికొత్త షేడ్ ని రుచి చూపించాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రం లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ చేసిన మంచు మనోజ్,మిరాయ్ చిత్రం లో పూర్తి స్థాయి విలన్ రోల్ లో కనిపించి ఆడియన్స్ ని బాగా అలరించాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వడం తో మనోజ్ కి మంచి పేరొచ్చింది. దీంతో ఆయన ఇప్పుడు మళ్లీ హీరో గా సినిమాలు చేయడానికి సిద్దమయ్యాడు.
అందులో భాగంగా మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి'(David Reddy). టైటిల్ చూస్తేనే చాలా వెరైటీ గా ఉంది కదూ, మరి అదే మనోజ్ మార్క్ అంటే. ఈ చిత్రం ద్వారా హనుమ రెడ్డి యక్కంటి అనే వ్యక్తి ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో స్వతంత్ర సమరయోధుల క్యారెక్టర్స్ ఒక రెండు ఉంటాయట. ఒక క్యారక్టర్ కోసం తమిళ స్టార్ హీరో శింబు(Silambarasan TR) ని సంప్రదించారట. రెండవ క్యారక్టర్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ని సంప్రదించినట్టు తెలుస్తోంది. శింబు ఈ చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక రామ్ చరణ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడం ఒక్కటే బ్యాలన్స్ ఉంది. ఒకవేళ రామ్ చరణ్ ఒప్పుకొని ఈ సినిమా చేస్తే మాత్రం, మామూలు రేంజ్ ఉండదు. సినిమాకు మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. మనోజ్ కి కావాల్సినంత రీచ్ వస్తుంది.
రామ్ చరణ్, మంచు మనోజ్ ప్రాణ స్నేహితులు. కష్టమైన, నష్టమైనా, ఏదైనా కలిసి పంచుకునేంత బంధం వీళ్లిద్దరి మధ్య ఉంది. ఎన్నోసార్లు రామ్ చరణ్ గురించి పలు సందర్భాల్లో మనోజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మనోజ్ నోరు తెరిచి అడిగితే రామ్ చరణ్ చేయకుండా ఉండదు. ప్రస్తుతానికి డేట్స్ అందుబాటు లేక గ్రీన్ సిగ్నల్ పెండింగ్ లో పడుండొచ్చు కానీ, కచ్చితంగా రాబోయే రోజుల్లో రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడని అంటున్నారు విశ్లేషకులు. అన్నయ్య మంచు విష్ణు కోసం ప్రభాస్ ‘కన్నప్ప’ చిత్రం లో నటించగా, తమ్ముడు మంచు మనోజ్ కోసం రామ్ చరణ్ ‘డేవిడ్ రెడ్డి’ లో నటించబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి.