Game Changer : సక్సెస్ ఒక మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. సక్సెస్ ని తలకు ఎక్కించుకుంటే అత్యంత ప్రమాదం. ఇది ఎన్నోసార్లు రుజువు అయ్యింది కూడా. ఒక్కోసారి సక్సెస్ ని చూసుకొని ఎదుటి వ్యక్తి కష్టాన్ని గుర్తించడం మానేస్తాం, వాళ్ళని ఎన్ని విధాలుగా అవమానించాలో, అన్ని విధాలుగా అవమానిస్తుంటాం. ప్రస్తుతం నిర్మాత దిల్ రాజు అదే చేస్తున్నాడు. ఇతన్ని నమ్మి రామ్ చరణ్ తన విలువైన మూడేళ్ళ సమయాన్ని కేటాయించాడు. ఆ విలువైన సమయాన్ని దిల్ రాజు గడ్డి పూసతో సమానంగా చూస్తున్నాడని అతని ప్రవర్తనని చూసి చెప్తున్నారు అభిమానులు. ఈ సంక్రాంతికి ఆయన నుండి ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు విడుదల అయ్యాయి. ‘గేమ్ చేంజర్’ ఫలితం తెలిసిందే. కావాలని ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవ్వరూ చేయరు, హిట్ అవ్వాలనే చేస్తారు, దురదృష్టం కొద్దీ అవి ఫ్లాప్ అవుతుంటాయి, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అదే జరిగింది.
కానీ ఆ సినిమాతో ఆయన నష్టపోయింది ఏమి లేదు. తెలివిగా అలోచించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని విడుదల చేసి ఆ నష్టాలను పూడ్చుకున్నాడు. భారీ లాభాలను అందుకున్నాడు. అందుకు ఆయన ఆనందం ఆకాశాన్ని అంటింది. సక్సెస్ సెలెబ్రేషన్స్ వరుసపెట్టి చేస్తూనే ఉన్నాడు. తన నుండి రెండు సినిమాలు విడుదలైనప్పుడు, థియేటర్స్ లో రన్నింగ్ లో ఉండగా, ‘గేమ్ చేంజర్’ ని పూర్తిగా వదిలేయడం ఎంత వరకు కరెక్ట్?, ఆ సినిమా గురించి విడుదల తర్వాత కనీసం ఒక ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేయాలని దిల్ రాజు కి అనిపించలేదు. అక్కడితో వదిలేయలేదు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి వరుసగా సక్సెస్ సెలెబ్రేషన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇది పాపం రామ్ చరణ్ చూస్తే నా సినిమాని కనీసం పట్టించుకోలేదు అని ఫీల్ అవ్వడా? అనేది కూడా అయన మతిలోకి రావడం లేదు. విడుదలైన మొదటి వారంలోనే మా సినిమా ఫ్లాప్ అయ్యింది అనే సంకేతాలు ఆడియన్స్ కి పంపించాడు.
‘గేమ్ చేంజర్’ చిత్రంలో అప్పన్న క్యారెక్టర్ కి పొడిచే వెన్నుపోటు కంటే దారుణమైన వెన్నుపోటు ఇది. ఇవన్నీ పక్కన పెడితే, నిన్న ఆయన ఒక అడుగు ముందుకేసి, ‘గేమ్ చేంజర్’ చిత్రం పై ఎన్నో పరోక్షంగా సెటైర్లు వేసాడు. కాంబినేషన్స్ జోలికి వెళ్లి చేతులు కాల్చుకున్నాను, ఇక మీదట అలాంటి పొరపాట్లు చేయను అంటూ నేరుగా చెప్పేసాడు. అంతే కాదు, ‘గేమ్ చేంజర్’ విడుదలైన మరుసటి రోజు మూవీ టీం నుండి వచ్చిన ఫేక్ పోస్టర్ ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. ఈ పోస్టర్ ని విడుదల చేయించింది రామ్ చరణ్ టీం అని అర్థం వచ్చేలా కామెంట్స్ పరోక్షంగా కామెంట్స్ చేశాడు. నీ సినిమా కోసం బంగారం లాంటి ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ వదులుకోవాల్సి వచ్చింది, అందుకు ఆయన మీద మంచి కృతజ్ఞతనే చూపిస్తున్నావు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ దిల్ రాజు ని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు.