Raju Weds Rambai Movie Review : నటీనటులు : అఖిల్ రాజ్, తేజస్విని రావు, చైతూ జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి తదితరులు…
దర్శకత్వం : సాయిలు కంపాటి
మ్యూజిక్. : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : వజీద్ బేగ్…
ప్రతి వారం చాలా సినిమాలు వస్తాయి. కానీ వాటిలో కొన్ని ఓకే అనిపిస్తే, మరికొన్ని హిట్ టాక్ ను సంపాదించుకుంటాయి… ఇంకొన్ని సినిమాలు మాత్రం హృదయాలకు హత్తుకునేలా ఉంటాయి. మనం మూవీ చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన మైండ్ లో వాటి జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి… అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి…అవి వచ్చినప్పుడు మాత్రం ఒక దశాబ్ద కాలం పాటు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంటాయి…వేణు ఉడుగుల లాంటి స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా మారి సాయిలు కొంపాటి దర్శకత్వం లో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రేపు రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఈ రోజు నైట్ నుంచే ప్రీమియర్స్ వేశారు…నిజ జీవితపు కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం…
కథ
2010 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో గల ఖమ్మం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు లో బ్యాండ్ కొట్టుకునే రాజు (అఖిల్ రాజ్) అదే ఊరిలో వాళ్ల కులంలోనే ఉన్న రాంబాయి (తేజస్విని రావు)ని ప్రేమిస్తాడు… మొదట రాంబాయి రాజు ప్రేమను తిరస్కరిస్తోంది. కానీ రాజు బ్యాండ్ కొట్టే స్టైల్ అంటే రాంబాయికి చాలా ఇష్టం.దాంతో తెలియకుండానే రాజుతో ప్రేమలో పడుతోంది. రాంబాయి వాళ్ల నాన్న వెంకన్న (చైతూ జొన్నలగడ్డ) కి ఒక కాలు సరిగ్గా ఉండదు. కానీ కోపం మాత్రం చాలా ఎక్కువుంటుంది. ఆయన ప్రభుత్వ హాస్పిటల్ లో కంపోండర్ గా పనిచేస్తాడు. వెంకన్న చీటికీ మాటికి ఇంటి పక్కన ఉండేవాళ్లతో గొడవలు పెట్టుకుంటాడు. ఇక రాజు రాంబాయి లు ప్రేమించుకుంటున్న విషయం వెంకన్న కి తెలుస్తోంది…
దాంతో వెంకన్న తన కూతురికి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూస్తాడు. ఇక ఆ పెళ్లి చూపులకు రాజు వచ్చి ఆపడం తో కోపానికి గురైన వెంకన్న చుట్టుపక్కల వాళ్ళ దగ్గర తన పరువు పోయిందని, తనకి ఇష్టం లేకపోయిన రాంబాయిని రాజు కి ఇచ్చి పెళ్ళిచేయడానికి ఒప్పుకుంటాడు… మరి తన పంతాన్ని విడిచి వెంకన్న నిజంగానే రాంబాయిని రాజుకు ఇచ్చి పెళ్లి చేశాడా..? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు సాయిలు ఈ మూవీ ని యధార్థ సంఘటనల ఆధారంగా తీశాడు. మూవీ స్టార్టింగ్ లోనే ‘ప్రేమే ప్రేమకు శాశ్వత శత్రువు’ అనే ఒక టైటిల్ వేసి దానికి తగ్గట్టుగా స్టోరీ ని నడిపించాడు.హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్ టైనింగ్ గా తీసుకెళ్లిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం ఎమోషనల్ గా కట్టి పడేశాడు. డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్రైజెషన్స్ సినిమాను నిలబెట్టాయి.ముఖ్యంగా వెంకన్న పాత్ర మీద ఆయన చాలా కేర్ తీసుకున్నారు… రాజు – రాంబాయి మధ్య వచ్చే ప్రతి సీన్ ఈ సినిమాకి హైలెట్ అయ్యాయి.ఎమోషనల్ సన్నివేశాలను ఎలాగైతే ఎఫెక్టివ్ గా రాసుకున్నాడో వాటిని బాగానే హ్యాండిల్ చేశాడు.యూత్ ఎలాంటి సీన్స్ కోరుకుంటారు అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి. ఆర్టిస్టులను వాడుకున్న విధానం కూడా బాగుంది.లవ్ సీన్స్ లో ఇంకొంచెం డెప్త్ చూపిస్తే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేవి. అక్కడక్కడ కొంచెం రొటీన్ లవ్ స్టోరీ ల అనిపించినప్పటికీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు.
సినిమా మొత్తం ఒకెత్తయితే క్లైమాక్స్ మరొకెత్తనే చెప్పాలి.ప్రేమ కి అంతం ఉండదనే పాయింట్ కు న్యాయం చేశాడు.రాజు మనసులో రాంబాయి మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేసిన సన్నివేశం అద్భుతం.ఇక సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వెంకన్న క్యారెక్టర్ ను తిట్టుకోని వారు ఉండరు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయింది. ‘రాంబాయి నీ మీద మనసయనే’ అనే సాంగ్ బాగుంది…డైరెక్టర్ సాయిలు మొదటి సినిమా అవ్వడంతో డైరెక్షన్ కొన్ని చోట్ల అంతా ఎఫెక్టివ్ గా అనిపించలేదు…
ఇక రాజు క్యారెక్టర్ చేసిన అఖిల్ రాజ్ యాక్టింగ్ బాగుంది… పర్ఫెక్ట్ విలేజ్ లో ఉండే కుర్రాడు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. తన పాత్రకి న్యాయం చేశాడు.కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. రాంబాయి పాత్రలో కనిపించిన తేజస్విని రావు చాలా చక్కని నటనను పోషించింది. గతం లో ఆమె షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా దర్శనమిచ్చింది. రాంబాయి పాత్ర తనకంటే ఇంకెవరు బాగా చేయలేరు అనీ కాన్ఫిడెంట్ తో పెర్ఫెక్ట్ విలేజ్ అమ్మాయిని దింపింది. తన నటనలో ఎక్కడ కూడా తడబాటు కనిపించలేదు. వెంకన్న పాత్ర పోషించిన చైతూ జొన్నలగడ్డ సైతం ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.ఒక్క కాలుతో కుంటుకుంటూ నడుస్తూ ఆయన చూపించిన విలనిజం అంత ఇంత కాదు.
ఈ మూవీ చూసిన ప్రేక్షకులందరు ఇండస్ట్రీకి మరో విలన్ దొరికాడు అనడం పక్కా…ఇక శివాజీ రాజా డీసెంట్ నటనతో మెప్పించాడు…అనిత చౌదరి చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ పాత్ర చేయడం, అందులోనూ ఆమె తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టడం నిజంగా చాలా బాగుంది… ఇక మిగతా ఆర్టిస్టుల్లందరూ వాళ్ల పాత్రల మేరకు ఒకే అనిపించారు…
సురేష్ బొబ్బిలి మ్యూజిక్ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి…సినిమా రిలీజ్ కి ముందే తన సాంగ్ తో హైప్ తెప్పించాడు…ఇక వజీద్ బైగ్ సినిమాటోగ్రఫీ ఓకే అనిపించినప్పటికి ఇంకా కొంచెం బెటర్ గా చేయవచ్చు అనిపించింది. ఎంతసేపు వైడ్, క్లోజ్ షాట్స్ మాత్రమే వాడారు. కానీ విలేజ్ బ్యూటీని చూపించే ప్రయత్నం చేయలేదు…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సైతం ఒకే అనిపించేలా ఉన్నాయి… మూవీ మొత్తం ఒకే ఊరిలో ఉండటం తో మేకింగ్ ఖర్చు కూడా పెద్దగా అవ్వలేదనే విషయం మనకు తెలిసిపోతోంది…
సినిమాలో బాగోలేనివి ఇవే…
విజువల్స్ ఇంకాస్త క్వాలిటీ గా ఉండాల్సింది…
డైరెక్షన్ అక్కడక్కడ మైనస్ అయింది…
సినిమాలో బాగున్నవి ఇవే…
కథ
మ్యూజిక్
హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ
క్లైమాక్స్…
ఫైనల్ వర్డ్ : నిజమైన ప్రేమకు మరణం అడ్డు కాదు…
రేటింగ్ : 2.75/5
