Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా సింపుల్. వందల కోట్ల సంపాదన, వేల కోట్ల ఆస్తి ఉన్నా సాధారణ జీవితాన్ని ఇష్టపడతారు. విరామ సమయంలో ఆయన ఆశ్రమాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శిస్తారు. నేలపై పడుకుంటాడు. ఆర్డినరీ భోజనం చేస్తారు. రజినీకాంత్ కి ఉన్న మరో గొప్ప గుణం… ఆయన తన మూలాలను ఎప్పటికీ మర్చిపోరు. రజినీకాంత్ జీవితం బెంగుళూరులో బస్ కండక్టర్ గా మొదలైంది. ఆ సమయంలో తనకు తోడుగా ఉండి, ప్రోత్సహించిన మిత్రులను కూడా ఆయన వదల్లేదు.
బెంగుళూరులో నివసించే మిత్రుడు రావ్ బహుదూర్ ఇంటికి ఆయన తరచుగా వెళతారు. వాళ్ళ ఇంట్లో అతనితో గడపడం రజినీకాంత్ కి చాలా ఇష్టం. ఆయన సింప్లిసిటీ కి తాజా ఘటన ఉదాహరణగా నిలిచింది. రజినీకాంత్ హీరో కాక ముందు బస్ కండక్టర్ గా పనిచేసిన బస్ డిపోను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. బెంగుళూరులోని జయనగర్ బిఎంటీసీ బస్ డిపోలో ఆయన సందడి చేశారు.
రజినీకాంత్ విజిట్ పై ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో సదరు డిపో ఉద్యోగులు ఆశ్చర్యంలో ముగినిపోయారు. రజినీకాంత్ తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. తాను ఒకప్పుడు పని చేసిన ప్రదేశాన్ని అంతా తిరిగి చూసుకున్నారు రజినీకాంత్. అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. జయనగర్ బిఎంటీసీ ఉద్యోగులతో రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మూడు వారాలుగా వసూళ్ల వర్షం కురిపిస్తున్న జైలర్ రూ. 600 కోట్ల మార్క్ చేరుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. చాలా గ్యాప్ తర్వాత రజినీకాంత్ తన రేంజ్ హిట్ కొట్టాడు. కోలీవుడ్ లో ఎప్పటికీ తానే నెంబర్ వన్ అని నిరూపించాడు. జైలర్ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేయగా… తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.