Anand Mahindra- Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. రాజమౌళి ఎలాంటి సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ అనే నానుడి స్థిరపడిపోయింది. ఆయన ఏ జోనర్ లో తీసినా, ఎలాంటి కథ అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించుకుంటున్నది. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా 100 కోట్లు వసూలు చేస్తేనే గొప్ప విషయం అనుకున్నారు. కానీ రాజమౌళి వల్ల ఆ స్థాయి ఏకంగా 1800 కోట్లకు చేరుకుంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
సింధూ నాగరికత నేపథ్యంలో
ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ రూపొందించిన రాజమౌళి సింధూ నాగరికత నేపథ్యంలో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా కు వచ్చింది. ఈ క్రమంలో ఆయన సింధూ నాగరికతకు సంబంధించిన ఒక ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ” ఇలాంటి చిత్రాలు మన చరిత్రకు జీవం పోస్తాయి.. నాటి జీవన పరిస్థితులను ప్రపంచానికి తెలియజేస్తాయి. ఇలాంటి వాటిపై ఒక సినిమా తీయగలరా” అని మహీంద్రా కామెంట్స్ చేశారు. ఎస్ ఎస్ రాజమౌళి ని ట్యాగ్ చేశారు. దీనికి వెంటనే రాజమౌళి కూడా రిప్లై ఇచ్చారు..” మగధీర సినిమా షూటింగ్ సమయంలో ధోలా వీరా లో అక్కడ ఒక చెట్టు నన్ను ఆకర్షించింది. అది శిలాజంగా మారిపోయిన పరిస్థితులు చూసి ఆశ్చర్యం అనిపించింది.. సింధులోయ నాగరికతను ఆ చెట్టు చెబుతున్నట్టు నాకు అనిపించింది. అప్పుడే సింధూ ఎలా ఆవిర్భవించింది? ఎలా కాలగర్భంలో కలిసిపోయింది? అనే సందేహం వచ్చింది. దాని చుట్టూ ఒక కథ అల్లుకుని, సినిమాగా తీయాలి అనుకున్నా. దాని తర్వాత కొన్ని సంవత్సరాల అనంతరం పాకిస్తాన్ దేశాన్ని సందర్శించాను. మొహంజోదారో ప్రాంతాన్ని చూడాలి అనుకున్నాను. దీనికోసం గట్టి ప్రయత్నాలు కూడా చేశాను. కానీ నాకు పాక్ నుంచి అనుమతులు రాలేదు అని రాజమౌళి పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం వీరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది.
మహేష్ తో సినిమా
ఆర్ఆర్ఆర్ విజయం తర్వాత రాజమౌళి స్థాయి మరింత పెరిగింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించడంతో రాజమౌళి తీసే తర్వాతి సినిమాను యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నది. అయితే రాజమౌళి తర్వాత రూపొందించే సినిమా మహేష్ హీరోగా ఉంటుంది.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను విజయేంద్ర ప్రసాద్ రాశారు.. ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆఫ్రికన్ అడ్వెంచర్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్నారు.. దీనికి ఆరంభం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇక ఆనంద్ మహీంద్ర కూడా సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేనివి.. మరోవైపు రాజమౌళి ఎలాంటి పాయింట్ పట్టుకున్నా దాన్ని పూర్తిగా కమర్షియల్ గా మార్చేయగలడు. రాజమౌళి తలచుకుంటే సింధూ నాగరికత వెండి తెరపై వెలిగిపోవడం పెద్ద కష్టమేమీ కాదు.. అయితే ఆ బ్యాక్ డ్రాప్ తో సినిమా తీస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
These are amazing illustrations that bring history alive & spark our imagination. Shoutout to @ssrajamouli to consider a film project based on that era that will create global awareness of that ancient civilisation… https://t.co/ApKxOTA7TI
— anand mahindra (@anandmahindra) April 29, 2023