SSMB 29: ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ దశలో ఉండగానే మహేష్ బాబుతో మూవీ ప్రకటించాడు రాజమౌళి. లాక్ డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ సమయంలో ఆన్లైన్ ద్వారా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు అవుతున్నా.. మహేష్ బాబు మూవీని రాజమౌళి పట్టాలెక్కించలేదు. మహేష్ బాబుకు కథ రాయడం అంత సులభం కాదు. ఏకంగా రెండేళ్లు పట్టిందని విజయేంద్రప్రసాద్ ఓ సందర్భంగా అన్నారు.
ఎట్టకేలకు ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా సెరిమోని జరిగింది. మీడియాకు అనుమతి లేకుండా అత్యంత రహస్యంగా ఈ కార్యక్రమం పూర్తి చేశారు. కనీసం ఫోటోలు కూడా బయటకు వదల్లేదు. అక్కడ కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారని సమాచారం. ఇదిలా ఉండగా.. రాజమౌళి కెన్యా దేశంలోని అడవుల్లో షూటింగ్ చేయనున్నాడు.
కాగా ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ఈ మూవీలో మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అది అధికారికమే అని నేటితో రుజువైంది. ప్రియాంక చోప్రా, రాజమౌళి, కీరవాణి కలిసి దిగిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఎస్ఎస్ఎంబి 29 హీరోయిన్ ప్రియాంక చోప్రా అని క్లారిటీ వచ్చేసింది. యూనివర్సల్ సబ్జెక్టుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న తరుణంలో.. హాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ప్రియాంక చోప్రాను రాజమౌళి ఎంచుకున్నాడని అర్థం అవుతుంది.
కాగా వారు ధరించి డ్రెస్ లపై NTWINE అనే లోగో ఉంది. అది ఒక మ్యూజిక్ బ్యాండ్ నేమ్. సదరు మ్యూజిక్ బ్యాండ్ కి ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధం ఏమిటో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రం కోసం మహేష్ బాబు జుట్టు బాగా పెంచి లుక్ మార్చేశాడు. దాదాపు 3 ఏళ్ళు రాజమౌళి ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కేటాయించినట్లు తెలుస్తుంది.