Puri Jagannadh- Charmi: ఒక్క లైగర్ మూవీ ఎన్నో ఆశలను చిదిమేసింది. ప్యాన్ ఇండియా హీరో అవుదామని కలలుగని కష్టపడ్డ విజయ్ దేవరకొండకు ఆశానిపాతం అయ్యింది. ఈ ఒక్క మూవీతో బాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలనుకున్న పూరి జగన్నాథ్ కల తీరలేదు. ఇక నిర్మాతగా కాసులు సంపాదించుకుందామనుకున్న చార్మి ఆశ నెరవేరలేదు. మొత్తంగా ఈ ముగ్గురు త్రయం.. లైగర్ కు ముందు దేశవ్యాప్తంగా సినిమా తీసుకొచ్చిన హైప్.. రిలీజ్ అయ్యాక మాయమైంది. సినిమాలో కంటెంట్ లో లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పటికీ రాచపుండులా ‘లైగర్’ గాయం అటు పూరి జగన్నాథ్ ను.. ఇటు చార్మిని పొడుస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఈ లైగర్ ఫ్లాప్ నుంచి తేరుకోకపోవడంతో విజయ్ తో తలపెట్టిన నెక్ట్స్ మూవీ ‘జనగణమన’ను ఆపేసినట్టు తెలిసింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా సిద్ధం కానున్న ఈ చిత్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరకెక్కించడం సరికాదని.. తన మైండ్ బాగా లేదని.. కథలోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉండడంతోనే సినిమాను ఆపేసినట్టు చెప్పారట…
విజయ్ దేవరకొండను వేరే సినిమాలు చేసుకోమని పూరి చెప్పినట్టు తెలిసింది. ఇక చార్మి బాధ మరోరకంగా ఉంది. దాదాపు 100 కోట్లు పెట్టి తీసిన ఈ మూవీ నష్టాలను మిగల్చడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ‘లైగర్’ మూవీ కథ, కథనం బాగాలేదని..పూరి డైరెక్షన్ ఇది కాదని.. దీన్ని ‘చార్మి’ డైరెక్ట్ చేసి కొంప ముంచిందని.. ఆమెను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారట..

ఈ క్రమంలోనే చార్మి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘కాస్త శాంతించండి అబ్బాయిలూ.. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నా.. ‘పూరీ కనెక్ట్స్’ సంస్థ మరింత ధృడంగా.. ఉన్నతంగా సిద్ధమై త్వరలోనే మళ్లీ తిరిగి వస్తుంది’ అని చార్మి పేర్కొన్నారు. దీంతో ఆమె సోషల్ మీడియాను వీడుతున్నట్టు ప్రకటించినట్టైంది. లైగర్ ఫ్లాప్ దెబ్బకు ఇటు పూరి తన తదుపరి సినిమాను ఆపేయగా.. నెటిజన్ల తాకిడికి చార్మి ఏకంగా సోషల్ మీడియా నుంచే వైదొలిగిన పరిస్థితి నెలకొంది.