Tollywood Progress: త్రివిక్రమ్ (Trivikram).. నేటి తెలుగు (Telugu) మాటకు గురువు. ఒకప్పుడు పండితులు వేదాలు అన్ని చదివి వాటి సారాంశాన్ని పామరులకు చెప్పి లోక కల్యాణం కోసం తమ వంతు ప్రయత్నం చేసేవారట. మరి ఈ రోజుల్లో అలా బోధించే పండితులు ఎవరు లేరు కదా. ఒకవేళ ఉన్నా.. అంత పాండిత్యంతో చెప్పే మాటలను వినే భాషా జ్ఞానం ఈ డిజిటల్ జనరేషన్ కి లేదు కదా.
కానీ సినిమా అనే మధ్యమము ద్వారా వినోదంతో పాటు జ్ఞాన బోధ చేస్తే వింటారు. అలాంటి జ్ఞాన బోధ చేయడానికే వచ్చినట్టు ఉన్నాడు ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ. త్రివిక్రమ్ అనే కలం పేరు పెట్టుకుని ఆణిముత్యాలు లాంటి మాటలు అందించాడు. అందుకే త్రివిక్రమ్ రాకతో జనాలు మాట్లాడుకునే శైలి పూర్తిగా మారిపోయింది.
ఒక జీవితానికి సరిపడా అర్థాన్ని కేవలం రెండు మూడు వాక్యాల్లోనే చెప్పి ముగించే ఆయన సంభాషణ శైలి పెను సంచలనం అనే చెప్పాలి. ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు కానీ పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. లేచి పోయి పెళ్లి చేసుకునే జంటల పై ఇది విపరీతంగా ప్రభావితం చేసింది.
పెళ్లి విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వెళ్లనీయకుండా చేసిన గొప్ప మాట ఇది. అందుకే, త్రివిక్రమ్…తెలుగు యువత అంతా ప్రేమగా “గురూజీ” అని పిలుచుకుంటుంది. ఏది ఏమైనా గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వకుండా, ఒక్క చిన్న మాటతో ఎంతో గొప్ప విలువలు చెప్పగల శక్తి ఉన్న త్రివిక్రమ్ లాంటి మాటల రచయితలు ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం.
అయితే, హీరోలు నిర్మాతలు కథకు ఇచ్చే విలువ మాటలకు కూడా ఇస్తే.. ఆ విలువకు గౌరవం పెరుగుతుంది. మరెంతో మంది గొప్ప మాటల రచయితలు ముందుకు వస్తారు. అప్పుడే తెలుగు సినిమాలకు పురోగతి ఉంటుంది.