
ANR Biopic: తెలుగు పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు లాంటి వారు అని గొప్పగా చెబుతూ ఉంటారు సినీ పెద్దలు. అయితే, ఆ అలనాటి హీరోల గొప్పతనం గురించి భావితరాలకు తెలియాలి అంటే.. బయోపిక్ లు మంచి అవకాశం అనుకోవచ్చు. పూర్తి నిజాలు చూపించలేకపోయినా… వారి జీవిత గమనాన్ని, గమ్యాన్ని మాత్రం కచ్చితంగా సినిమాలో చూపించొచ్చు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్, సావిత్రి, జయలలిత లాంటి గొప్ప నటీనటుల బయోపిక్ లు వచ్చాయి.
మరి ఏఎన్నార్ బయోపిక్ మాటేమిటి ? ఈ విషయం గత కొన్ని నెలలుగా నాగార్జున మదిలో మెదులుతూనే ఉంది. అయితే, అక్కినేని నాగేశ్వరరావు అంటే ఒక నటుడు మాత్రమే కాదు, క్రమశిక్షణకు మారుపేరు. రొమాంటిక్ ఫీలింగ్స్ కి కేరాఫ్ అడ్రస్. అన్నిటికీ మించి తెలుగు చిత్ర సీమను మద్రాసు నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చిన మొట్టమొదటి హీరో కూడా.

ఇవన్నీ పక్కన పెడితే.. అన్నపూర్ణ స్టూడియో స్థాపనకు కృషి చేసి.. తెలుగు సినిమా వాళ్లకు ఒక గౌరవాన్ని తెచ్చిన హీరో కూడా. అందుకే, అక్కినేని బయోపిక్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి. నాగార్జున కూడా ఈ బయోపిక్ పై ఆసక్తిగానే ఉన్నాడు. కానీ ధైర్యం చేయడం లేదు. ఏఎన్నార్ పాత్రలో ఎవరు నటించాలి ? అసలు ఏఎన్నార్ జీవితాన్ని చూపించాలి అంటే.. అన్ని దశలు చూపించాలి.
అది సాధ్యం అవుతుందా ? అందుకే, ఇన్నాళ్లు నాగ్ సైలెంట్ గా ఉండిపోయాడు. అయితే తాజాగా నిర్మాత విష్ణు ఇందూరి, నాగార్జునతో ఏఎన్నార్ బయోపిక్ పై చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది. విష్ణు ఇందూరికి ఇప్పటికే బయోపిక్ ల నిర్మాత అని పేరు ఉంది. ఎన్టీఆర్, జయలలిత, కపిల్ దేవ్ బయోపిక్ ఇలా వరుసగా ప్రముఖుల జీవితాలను వెండితెర పై తీసుకురావడానికి విష్ణు ఇందూరి బాగా ఖర్చు పెడుతున్నాడు.
అందుకే, నాగార్జున కూడా ఏఎన్నార్ బయోపిక్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడట. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో మేటి నటుడిగా అశేష ప్రేక్షకులను అలరించిన ఏఎన్నార్ పై బయోపిక్ వస్తే అది తెలుగు సినిమాకే గర్వకారణం. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏఎన్నార్ పోషించిన పాత్రలను మళ్ళీ ఎవరు పోషించి మెప్పించగలరు ? ఐతే, సుమంత్, చైతు, నాగార్జున ముగ్గురు ఏఎన్నార్ పాత్రలో ఒదిగి పోగలరు.